హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : పండ్ల తోటలు, కూరగాయల పంటల సాగులో ఎదురయ్యే ప్రధాన సమస్య కలుపు మొక్కలు. వీటి వల్ల పంటలు నాశనం అవుతాయి. కలుపు మొక్కలను నివారించేందుకు కలుపు మందుతో పాటు కలుపు మొక్కలు తొలగించేందుకు కూలీలు అవసరం. ఇందుకు వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు కలుపు మొక్కల నివారణకు ఉద్యానశాఖ కొత్తగా ‘మ్యాట్ పద్ధతి’ని ప్రారంభించింది.
ధీర్ఘకాలిక పంటలైన డ్రాగన్‌ఫ్రూట్, మామిడి, దానిమ్మ, జామ, ఆపిల్‌బేర్ వంటి పండ్ల తోటల్లో కలుపు నివారణకు ఈ పద్ధతి మెరుగ్గా ఉపయోగపడుతుందని అధికారులు చెప్తున్నారు. రైతులకు ఉద్యానశాఖ ద్వారా ‘వీడ్మ్యాట్’ను రాయితీపై అందిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఒక్కో రైతుకు 50శాతం రాయితీతో 4వేల మీటర్ల వరకు ఇస్తున్నట్టు పేర్కొన్నారు.