సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 4 : రాష్ట్రంలో చేనేత రంగం కుదేలై నేతన్నల కుటుంబాలు ఎంతలా కుంగిపోయాయో కండ్లకు కట్టే దృశ్యమిది. ఇక్కడ గడ్డపార పట్టి మట్టి పనిచేస్తున్న వ్యక్తి నేతన్న. పేరు సామల యాదయ్య. డబుల్ ఇక్కత్ చీరలు నేయడం లో సిద్ధహస్తుడు. ఊరు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక. డబుల్ ఇక్కత్ చీర నేయడం లో యాదయ్యకు 30 ఏండ్ల అనుభవం ఉన్న ది. కానీ, కొద్దినెలలుగా చేనేత పనుల్లేక మగ్గం మూలకు పడింది. కుటుంబాన్ని పోషించుకునేందుకు యాదయ్య ఉపాధి హామీ కూలీగా మారాల్సి వచ్చింది. పలక, చిటికి పట్టిన చేతులు పలుగు, పార పట్టాయి.
మగ్గం పని లేక యాదయ్య కొడుకు హైదరాబాద్లో కారు నడుపుతున్నాడు. భార్యకు ఆరోగ్యం బాగలేకపోవడంతో కోడలితో కలిసి యాదయ్య ఉపాధి పనులకు వెళ్తున్నాడు. పదేండ్లలో ఎప్పుడూ ఇలాంటి రోజులు చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. చేనేతను నమ్ముకున్న తమకు వేరే పనులు రాక కూలీలుగా మారామని చెప్తున్నాడు. కోడలిని పనికి తీసుకెళ్తుంటే ఎంతో దుఃఖం వస్తున్నదని, కానీ ఇల్లు గడువాలంటే తప్పడం లేదని కండ్ల నీళ్లు తీశాడు. మగ్గం మీద నెలకు రూ.25 వేల వరకు సంపాదించిన తనకు ఇప్పుడు కూలి పనులకు పోతే 10 వేలు రావడం లేదని ఆవేదన చెందాడు. ప్రభుత్వం చేనేత కుటుంబాలను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.