Weather | తెలంగాణలో రాగల నాలుగురోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలుంటాయని చెప్పింది. వాయువ్య ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల నుంచి మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. ఉత్తర తమిళనాడు నుంచి దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు ఇంటీరియర్ కర్నాటక మీదుగా సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది.
Read Also : TGSRTC | బస్‌పాస్ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ.. నేటి నుంచే అమల్లోకి
వాయువ బంగాళాఖాతం, ఆనుకొని ఉన్న ఉత్తర తీర ఒడిశా, దక్షిణ గంగా తీర పశ్చిమ బెంగాల్ వరకు సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ క్రమంలో సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. మంగళవారం కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది.
Read Also : Harish Rao | కాళేశ్వరం కమిషన్ 20 ప్రశ్నలు.. ప్రతి ప్రశ్నకు ఆధారాలతో సహా వివరించిన హరీశ్‌రావు
ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అలాగే, బుధ, గురు, శుక్రవారాల్లోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కొనసాగుతాయని వివరించింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, సంగారెడ్డితో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లా భిక్నూర్ 9.8 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. తాడ్వాయిలో 7.9, జుక్కల్‌లో 7.7, కామారెడ్డిలో 7.5, సదాశివనగర్‌లో 7.3 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీఎస్‌డీపీఎస్ వివరించింది.