హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా పూర్తిగా అదుపులో ఉన్నదని, అయినా అప్రమత్తంగానే ఉండాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మి అనవసరంగా ఆందోళన చెందవద్దని కోరారు. పెండ్లిళ్లు, ఇతర విందులు, సామూహిక కార్యక్రమాలు, విహార యాత్రలు నిరభ్యంతరంగా జరుపుకోవచ్చని, వాయిదా వేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇతర రాష్ర్టాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అటువైపుగా వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోనూ ముందుజాగ్రత్తగా కొంచెం అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా తిరిగే సమయంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కోరారు. ఐటీ కంపెనీలు వందశాతం సిబ్బందితో పనిచేయాలని సూచించారు. శుక్రవారం ఆయన కోఠిలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నాలుగు వారాలుగా కేసులు సగటున 20-24 మధ్య, పాజిటివిటీ రేటు 0.14 శాతం నమోదవుతున్నదని చెప్పారు. వైరస్ వ్యాప్తి చెందే ‘ఆర్ వ్యాల్యూ’ ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ప్రమాదమని, తెలంగాణలో ఇది 0.5 శాతం కన్నా తక్కువగా ఉన్నదని చెప్పారు. కాబట్టి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందవద్దని చెప్పారు.
రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిన నేపథ్యంలో.. వచ్చే నెలాఖరు వరకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని డీహెచ్ కోరారు. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం బయటికి వెళ్లొద్దని సూచించారు. కార్యకర్తల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సభలు, సమావేశాలు, పాదయాత్రలు వంటివి మధ్యాహ్నం 12-4 గంటల మధ్య నిర్వహించొద్దని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (నిన్) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 93.5 శాతం మందిలో కొవిడ్‌ను ఎదుర్కొనే ప్రతిరక్షకాలు కనిపించాయని చెప్పారు. రాష్ట్రంలో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్టేనని.. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగో వేవ్ వచ్చే అవకాశం లేదన్నారు. జూన్ రెండో వారంలో కేసులు కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నదని, అదికూడా చాలా తక్కువ కాలం ఉంటుందన్నారు. మొత్తంగా సంవత్సరం చివరినాటికి సాధారణ జలుబుగా మారిపోతుందన్నారు.