ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్ నామినేషన్ వేసిన అనంతరం మంత్రి మాట్లాడారు.
ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థలకు టీఆర్ఎస్ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులను నిలబెట్టే అవకాశం లేదన్నారు.
ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా రెండు రోజుల్లో కార్యాచరణ రూపొందించి విజయం సాధించేలా కృషి చేయాలన్నారు. నామినేషన్ కు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు జడ్పీ చైర్మన్ లు, ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.