వనపర్తి, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా రైతులందరినీ ఏకం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతు రాజ్యమే బీఆర్ఎస్ లక్ష్యమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడంతో బీజేపీ గుండెల్లో గుబులు మొదలైందన్నారు. గురువారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కర్ణాటక లోక్ జనశక్తి (పాశ్వాన్) రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఎల్జేపీ కర్ణాటక యువజన అధ్యక్షుడు నారాయణ కర్ణి, న్యాయవాది శేఖర్గౌడ, గణేశ్ యాదవ్, వీరేశ్‌రెడ్డి, గణేశ్ తదితరులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ అన్న నినాదం కమలం పార్టీ నేతలకు చెమటలు పట్టిస్తున్నదన్నారు. కేసీఆర్ తెలంగాణ దాటితే తమ ఉనికికే ఎసరు వస్తుందనే భయం మొదలైందని పేర్కొన్నారు. రాష్ర్టాభివృద్ధికి కేంద్రం ఆటంకాలు సృష్టిస్తూ, నిధులు మంజూరు చేయకుండా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నదని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. త్వరలో కర్ణాటకలోని రాయిచూర్ వేదికగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తాను స్వయంగా హాజరవుతానని చెప్పారు. కాగా, మెట్పల్లి నందిమల్ల గడ్డకు రూ.92 లక్షలతో.. 300 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 5 కి.మీ. మేర పైపులైన్ పూర్తి చేసి మినీ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి ప్రారంభించారు. క్షయ వ్యాధి బారిన పడిన 57 మందికి తన సొంత ఖర్చుతో పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. వనపర్తిలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్హాల్లో నిర్వహించిన క్రిస్మస్ విందుకు మంత్రి హాజరయ్యారు.