బంట్వారం, జనవరి 28 : ప్రభుత్వం వద్ద సరిపడా నిధులు లేవని అందుకే కల్యాణ లక్ష్మి పథకంలో భాగంగా తాము ఇస్తామన్న తులం బంగారం ఇవ్వలేకపోతున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి, బంట్వారం మండల కేంద్రాల్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసి, వివిధ గ్రామాల్లో సీసీ రోడ్ల పనుల శంకుస్థాపనలు చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ.. నిధులు లేకనే హామీ ఇచ్చిన ప్రకారం తులం బంగారం పంపిణీ చేయలేకపోతున్నట్టు చెప్పారు. మెల్లమెల్లగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే తులం బంగారం సైతం అందజేస్తామని చెప్పుకొచ్చారు. మహిళలకు రూ.2,500లు కూడా త్వరలోనే ముఖ్యమంత్రి అందజేస్తారని తెలిపారు. గత ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఇచ్చిన అన్ని హామీలను త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు.