చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 29: కారు గుర్తుకే ఓటు వేస్తామని కల్లు గీత కార్మికులు, గౌడ సంఘం ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. గీత కార్మికులు ఆర్థికంగా బలపడేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి గుర్తుచేశారు. మునుగోడు ప్రజల మదినిండా సీఎం కేసీఆర్, గులా బీ జెండానే ఉన్నదని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం డీ నాగారంలో శనివారం మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇం టింటికీ తిరిగి కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వృద్ధులు, మహిళలు, యువకులను ఆప్యాయంగా పలుకరించారు. అన్ని వర్గా ల ప్రజల నుంచి సంక్షేమ పథకాలకు మంచి ఆదరణ లభిస్తున్నదని చెప్పారు. ‘ఏ ఇంటికి వెళ్లినా మాకు సాయం అందించిన సీఎం కేసీఆర్‌ను మర్చిపోము.. ఓటుతో ఆయన రుణం తీర్చుకుంటాం’ అంటున్నారని తెలిపారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.