హైదరాబాద్ : చిన్నారి బాలిక మౌనిక(Maunika) మృతి బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Minister Talasani) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శనివారం రాంగోపాల్‌పేట లోని కళాసిగూడా నాలాలో పడి మౌనిక అనే బాలిక మృతి చెందగా మంత్రి సంఘటనా స్థలానికి వెళ్లి ఘటన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలిక ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని(Condolences ) తెలిపారు.
ఆయన మాట్లాడుతూ ఈ ఘటన తనను ఎంతో కలచి వేసిందని అన్నారు. బాలిక కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపున బాలిక కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. ఘటనపై విచారణ(Enquary) జరిపిస్తామని స్పష్టం చేశారు. చిన్నారి బాలిక మరణంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో ఉంటే రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు ప్రభుత్వం పై లేనిపోని ఆరోపణలు చేయడం దుర్మార్గమని ఆరోపించారు.
కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి నగరానికి ఒక్క రూపాయీ తీసుకురాలేదని పేర్కొన్నారు. చేతనైతే బాధిత కుటుంబానికి ఏదైనా సాయం చేయాలని సూచించారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేదని పేర్కొనడం బాధ్యతారాహిత్యం అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి ఎస్ఎన్డీపీ (SNDP) కార్యక్రమం క్రింద నగరంలో పలు నాలాల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.
సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో పికెట్, బేగంపేట, కళాసి గూడా , మినిస్టర్ రోడ్డులోని నాలాల అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల ఫలితంగా నగరంలో వర్షపు నీటితో ఏర్పడే ఇబ్బందులు తొలగిపోయాయని అన్నారు. మంత్రి వెంట డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, మల్లిఖార్జున్ గౌడ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.