హైదరాబాద్ : ఆర్టీసీ( RTC ) లో యూనియన్ ఎన్నికలు ముగిశాకే ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం కార్మికులను మోసం చేయడమేనని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో డ్రైవర్ శంకర్ గౌడ్ ( Driver Shanker Goud ) సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శంకర్ గౌడ్ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయాన్ని ఆయన అందజేశారు. మాజీ మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం కోసమే శంకర్ బలిదానం జరిగిందని పేర్కొన్నారు. వేలాదిమంది ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరుగుతుందని ప్రాణత్యాగం చేశారని అన్నారు.
ఆర్టీసీ కార్మికులలో ఐక్యత లేని కారణంగా ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.శంకర్ గౌడ్ కుమారునికి ఉద్యోగం కల్పించడంలో ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రక్రియ కేసీఆర్ ప్రభుత్వంలోనే పూర్తయిందని, అపాయింటెడ్ డేను ప్రభుత్వం ప్రకటించడమే మిగిలి ఉండగా ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు.