హైదరాబాద్/రంగారెడ్డి, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): కిన్నెర మొగులయ్య ఇంటి స్థల వివాదం కొలిక్కిరానున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో ఇందుకు మార్గం సుగమమైంది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి బుధవారం తనను కలిసిన మొగిలయ్యకు హామీ ఇచ్చారు. తనకు గత సర్కార్ కేటాయించిన ఇంటి స్థలం విషయమై కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇటీవల కిన్నెర మొగులయ్య కేటీఆర్‌ను కలిశారు.
వెంటనే స్పందించిన ఆయన కలెక్టర్‌కు ఫోన్ చేశారు. సమస్యను వివరించి పరిష్కరించాలని కోరారు. ఇం దుకు కలెక్టర్ సైతం సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో బుధవారం బీఆర్ఎస్ నేత, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డితో కలిసి కలెక్టర్‌ను కలిశారు. సమస్యను సావధానంగా విన్న ఆయన ఇంటి స్థలం వివాదంపై న్యాయపరంగా అండగా ఉండి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రైవేట్ వ్యక్తులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రభుత్వం తరఫున తగిన చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డిని ఆదేశించారు. మొగులయ్య సమస్యను పరిష్కరిస్తానని ఆందోళన అవసరం లేదని చెప్పారు.