తిమ్మాపూర్, డిసెంబర్ 4 : యాసంగి సీజన్ పంటలకు లోయర్ మానేరు జలాశయం నుంచి కాకతీయ కాలువ ద్వారా సూర్యాపేట జిల్లా వరకు సాగు నీరందిస్తామని ఇరిగేషన్ కరీంనగర్ ఈఎన్సీ శంకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలోని సీఈ కార్యాలయంలో బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం ఎల్ఎండీలో 23.735 టీఎంసీలు, శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్లో 26.73 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మి షన్ భగీరథ, తాగునీటి అవసరాలకు పోను రెండు ప్రాజెక్టుల నుంచి 25 టీఎంసీలు, ఎస్సారెస్పీ నుంచి 5 టీఎంసీలు కలి పి మొత్తం 30 టీఎంసీలు అందిస్తామని వివరించారు. కాకతీయ కాలువ 146 కిలోమీటర్ ఎల్ఎండీ నుంచి, 284 కిలోమీటర్ మహబూబాబాద్ వరకు ఒక విడతగా 8 రోజులు, 284 కిలోమీటర్ నుంచి 349 కిలోమీటర్ సూర్యాపేట వరకు మ రో విడతగా 7 రోజులు వదులుతామని చె ప్పారు. కాలువ మొత్తంలో 71 డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఉండగా.. స్టేజ్-1 కింద 5లక్షల ఎకరాలకు, స్టేజ్-2 కింద 4లక్షల ఎకరాలకు నీటిని విడుదల చేస్తామని వెల్లడించారు. నీటి విడుదల జనవరి ఒకటి నుంచి మార్చి 31 వరకు కొనసాగుతుందని చెప్పారు. కాకతీయ కెనాల్ ప్రధాన కాలువ నుంచి స్టేజ్-1 మహబూబాబాద్ వరకు 8రోజులు, అక్కడి నుంచి సూర్యాపేట వరకు 7 రోజులు వదులుతామని తెలిపారు.