కరీంనగర్ : రాష్ట్రంలోని పలు జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగు కమలాకర్( Minister Gangula) వెల్లడించారు. రైతులు ధైర్యంగా ఉండాలని, ప్రకృతి కోపించినా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు. కాలికి గాయం అయినప్పటికీ సీఎం కేసీఆర్(CM KCR) ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా అధికారులతో కలిసి కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించారు.
మొదటివిడత నష్టం మరవకముందే మరోసారి వర్షంతో నష్టం జరగడం బాధాకరమన్నారు. ప్రతీ అంగుళానికి, ప్రతీ పంటకు నష్ట పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో కొనుగోలు కేంద్రాలు ముందుగానే ఏర్పాటుచేయడంతో నష్టం కొద్దిమేర తగ్గిందని అన్నారు. కరీంనగర్ జిల్లా(Karimnagar District) చొప్పదండి, గంగాదర, హుజురాబాద్ మండలాలతో పాటు, కరీంనగర్ గ్రామీణంలోని చమాన్ పల్లి, తాహెర్ కొండాపూర్, ఫకీర్ పేట్, జూబ్లీ నగర్, చెర్లబూత్కూరు, ముగ్దుంపూర్ తదితర ఆరు గ్రామాల్లో 5వేల ఎకరాల్లో పూర్తి స్థాయిలో పంట నష్టం జరిగిందని వెల్లడించారు. ఈ గ్రామాల్లోనే దాదాపు 3144 ఎకరాలు నష్టపోయాయని అధికార యంత్రాంగం ప్రాథమిక అంచనాలను వేసిందన్నారు.
మొదటి విడతో అకాలవర్షాలతో నష్టపోయిన ప్రాంతాల్లో స్వయంగా ముఖ్యమంత్రి పర్యటించారని, ఎక్కువగా నష్టం జరిగిన హార్టికల్చర్ పంటపోలాల్లో స్వయంగా తిరిగి ఎకరాకు పదివేల నష్టపరిహారాన్ని సైతం అందించామన్నారు. మొదటి విడత పంటనష్టంగా జిల్లాలోని ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఎనిమిదన్నర కోట్లు విడుదల అయ్యాయని త్వరలోనే వాటిని రైతులకు అందజేయడంతో పాటు ప్రస్థుత నష్టాన్ని పూర్తి స్థాయిలో రెండు మూడురోజుల్లోనే అంచనా వేసి ఆదుకుంటామన్నారు.
రైతుల్లో భరోసా నింపేలా నీళ్లు, ఉచితకరెంటు(Free Power), మౌలిక వసతులు, రైతుబంధు(Raitu Bandu), సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయడంతో తెలంగాణ రైతులో భరోసా పెరిగిందని, గతంలో కన్నా ఎన్నో రెట్లు అధికంగా పంటను పండిస్తూ దేశానికే ఆదర్శంగా తెలంగాణ రైతు, ప్రభుత్వం నిలిచిందన్నారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని సివిల్ సప్లైస్ శాఖను అదేశించామని మంత్రి పేర్కొన్నారు. మంత్రివెంట అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, ఇతర ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుల ఉన్నారు.