హైదరాబాద్, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ): ‘హౌసింగ్ బోర్డ్ ఫర్ సేల్’ పేరుతో నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. హౌసింగ్‌బోర్డు భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్టు హౌసింగ్ కమిషనర్ బీ విజయేంద్ర తెలిపారు. ఇందులో భాగంగా భూములను జియో ఫెన్సింగ్ చేయడంతోపాటు ప్రహరీ నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లోని విలువైన భూముల పర్యవేక్షణలో లోపం ఉందని, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్టు పేర్కొన్నారు. బోర్డుకు రావాల్సిన లీజు బకాయిలు, పెండింగ్ కేసులు, ఇతర అంశాలపై ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో అధికారులకు ఆదేశాలు జారీచేసినట్టు చెబుతూనే, హౌసింగ్‌బోర్డు భూములు విక్రయిస్తున్నట్టు ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనంలో వాస్తవం లేదని వివరణ ఇచ్చారు.