హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఢిల్లీలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 10న జరిగే రాష్ట్ర క్యాబినెట్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు. లేదంటే ఈ నెల 17న రైల్‌రోకో నిర్వహిస్తామని హెచ్చరించారు. గత 18 నెలలుగా 42 శాతం రిజర్వేషన్ల కోసం అనేక రూపాల్లో పోరాటాలు చేశామని పేర్కొన్నారు. ఫలితంగా అసెంబ్లీలో, కౌన్సిల్లో బీసీ బిల్‌కు ఆమోదం లభించిందని అన్నారు. ప్రస్తుతం ఈ బిల్లు రాష్ట్రపతికి చేరిందని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని బిల్లుకు ఆమోదం లభించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.
బీసీ బిడ్డగా ప్రధానమంత్రి మోదీకి బీసీ రిజర్వేషన్లను ఆమోదించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో జాగృతి సంస్థ పోటీ చేయదని, బీఆర్ఎస్ పోటీ చేస్తుందని చెప్పారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. రైల్ రోకోకు మద్దతు కోరుతూ అన్ని పార్టీలకు లేఖలు రాస్తామని తెలిపారు. ఢిల్లీలో ఎవరినీ కలిసేది లేదని, కేవలం రిజర్వేషన్ల కోసం పోరాటమే అని ఆమె స్పష్టం చేశారు. బీసీ బిల్లుకు ఆమోదం కల్పించకుంటే ఆ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.