యాచారం, జనవరి 27: ప్యూచర్‌సిటీ కోసం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలోని ఓంకారేశ్వరాలయ భూములను తీసుకుంటే ఊరుకునేది లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హెచ్చరించారు. ఆ భూ ములు కౌలు రైతులకే దక్కాలని స్పష్టంచేశా రు. ఓంకారేశ్వరాలయానికి చెందిన 1,400 ఎకరాల భూమిని సేకరించేందుకు రేవంత్ సర్కార్ చేస్తున్న కుట్రలు తెలుసుకున్న జాన్‌వెస్లీ సీపీఎం నాయకులతో కలిసి మంగళవారం ఆ భూములను పరిశీలించారు. ప్రాణాలు పోయినా తమ భూములను ఫ్యూచర్‌సిటీకి ఇచ్చేదిలేదని రైతులు తేల్చిచెప్పారు. అనంతరం కుర్మిద్ద గ్రామ శివారులో ఏర్పాటు చేసిన కౌలు రైతుల సదస్సులో జాన్ వెస్లీ మా ట్లాడారు.
ఓంకారేశ్వరాలయానికి చెందిన 1,400 ఎకరాలు రైతులకే దక్కాలని స్పష్టంచేశారు. గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం 1,900ఎకరాలు సేకరిస్తే తప్పుబట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఫ్యూచర్‌సిటీ కోసం 30 వేల ఎకరాలను సేకరిస్తాననడం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని, సదరు భూములను తిరిగి రైతులకే ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం ఫ్యూచర్‌సిటీకి భూములివ్వాలని రైతులను బెదిరించడమేమిటని ప్రశ్నించారు.
భూసేకరణను ఆపాలని ఈ నెల 30న తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం ఆర్డీవో, కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు చేస్తామని పేర్కొన్నారు. అప్పటికి ప్రభుత్వం దిగిరాకుంటే రైతులతో కలిసి సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.