హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, తెలంగాణ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్ల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన పీఆర్టీయూటీఎస్ అనుబంధం ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల్ టీచర్స్ అసోసియేషన్( పీఆర్‌జీటీఏ) ఆవిర్భావ సమావేశంలో రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ.. గురుకుల టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు, హెల్త్‌కార్డులు మంజూరుచేయిస్తామని, పాఠశాలల్లో కేర్టేకర్లను నియమించేందుకు త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పిస్తామని తెలిపారు. ఈ నెలలోనే గురుకుల టీచర్ల బదిలీలు చేపట్టేందుకు సీఎంను ఒప్పించామని వెల్లడించారు. పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్‌జీటీఏ సంఘాన్ని పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, పీఆర్‌జీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌రెడ్డి, బాధ్యులు నరేశ్, అశోక్, స్వప్న, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.