హైదరాబాద్ : పాలిటెక్నిక్ విద్యార్థుల గొంతు కోసే జీవో 97 ను ప్రభుత్వం ఈ నెల 7 వ తేదీ లోగా ఉపసంహరించు ( Withdraw ) కోక పోతే సీఎం రేవంత్ ఇంటిని ముట్టడిస్తామని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav ) హెచ్చరించారు. గురువారం ఇందిరా పార్కు వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు (
Polytechnic Students ) చేపట్టిన ధర్నాకు హాజరై మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష మందికి పైగా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేసే జిఓ 97 ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని 20 రోజుల నుంచి విద్యార్థులు పోరాటం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పాలిటెక్నిక్ కాలేజీలకు చెందిన ఆస్తుల కోసమే ముఖ్యమంత్రి జీవో 97 ను తీసుకొచ్చారని విమర్శిం చారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులు రోడ్లపైకి వచ్చింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పాలిటెక్నిక్ కాలేజీలను ప్రయివేట్ పరం చేయాలనే దుర్మార్గపు ఆలోచనతోనే స్కిల్ యూనివర్సిటీకి బదలాయించాలని చర్యలు చేపట్టిందని మండిపడ్డారు.
ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం తో నడిచే యూనివర్సిటీ కి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండే రెండేళ్లు మాత్రమే మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.ప్రైవేట్ వ్యక్తులకు పాలిటెక్నిక్ ఆస్తులను కట్టబెట్టేందుకు, తాకట్టు పెట్టేందుకు కుట్రలు చేస్తుందని స్పష్టం చేశారు. సీనియర్ ఐఎఎస్ ఆకునూరి మురళి వంటి వంటి వ్యక్తులు కూడా ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను సమర్ధించడం బాధాకరం అన్నారు.జెన్ జీ చేసిన పోరాటానికి ప్రధానమంత్రి దిగొచ్చి కేంద్రమంత్రి చేత రాజీనామా చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో విద్యార్థులు పోరాడాలని, అధైర్య పడొద్దని విద్యార్థులకు భరోసా ఇచ్చారు.