KTR | తెలంగాణలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని.. ప్రజా సమస్యల పరిష్కారంపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆదివారం ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. అనంతరం కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీయాలని.. రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల విషయంలో బలంగా వాణిని వినిపించాలని కేసీఆర్ సూచించారని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యంగా వ్యవసాయరంగంలో దుర్భర పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలు నెరవేర్చక, నిలబెట్టుకోకపోయిందన్నారు.
అరకొరగా రుణమాఫీ చేసి.. రైతుభరోసా అనేది ఇంత వరకు లేకుండా చేసి.. కొనుగోలు కేంద్రాలు సరిగా నడపలేని పరిస్థితిపై, బోనస్ ఇవ్వకుండానే ఏదో చేసినట్లుగా నటిస్తూ.. ఇవాళ రైతులను దగా చేసి విజయోత్సవాల పేరిట మరొకసారి వారిని అవమానం పాలు చేస్తున్న వైనంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలోని రైతులందరికీ బీఆర్ఎస్ తరఫున మేం చెప్పేది ఒక్కటేనని.. మీ గొంతుగా శాసనసభలో, మండలిలో ప్రభుత్వాన్ని అన్ని విషయాల్లో నిలదీస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతుబంధు, రుణమాఫీ, బోనస్‌తో పాటు రైతు కూలీలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని మీకు హామీ ఇస్తున్నామన్నారు.
రాష్ట్రంలోని గురుకులాల్లో ఈ రోజు అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో రాష్ట్రవ్యాప్తంగా బలహీన వర్గాల పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కావొచ్చు. ఆ పిల్లలందరినీ ప్రభుత్వమే తల్లీ తండ్రి అయి వారి ఆలనపాలన చూసుకుంటుందని ఆ తల్లిదండ్రులు భావిస్తారు. ఈ రోజు హాస్టల్స్‌లో నెలకొన్న దుర్భరమైన పరిస్థితులను గురుకుల బాట ద్వారా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం వెలుగులోకి తీసుకువచ్చింది. ఆర్ఎస్ ప్రవీణ్ నాయకత్వంలోని కమిటీ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు అధ్యయన రిపోర్టును సమర్పించింది.
గతంలో విద్యాశాఖ మంత్రిగా పని చేసిన సబితా ఇంద్రారెడ్డి, సంక్షేమశాఖ మంత్రిగా పని చేసిన జగదీశ్‌రెడ్డి వారంతా తమ ఆలోచనలు, ఆ నాటి పరిస్థితులు.. ఆ రోజుల్లో ఎంత బాగా నడిచింది.. ఈ రోజు గురుకులాలు ఎందుకు నీరుగారిపోతున్నయో వివరించారని కేటీఆర్ తెలిపారు. గురుకులాలు ఆనాడు ఎంత చక్కగా నడిచాయో.. ఏ రకంగా విస్తరించాయో అవన్నీ ప్రజల కండ్ల ముందే ఉన్నయ్. వాటిని సంస్కారవంతంగా నడిపేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కేసీఆర్ సూచించారన్నారు. తప్పకుండా అక్కడ నెలకొన్న పరిస్థితులను కళ్లకుకట్టినట్లు.. అవసరమైతే ఫొటోలు, ఆధారాలు, వివరాలతో సహా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కేసీఆర్ ఆదేశించారని.. తప్పకుండా మరో కార్యక్రమంగా తీసుకుంటామన్నారు.
రాష్ట్రంలో దౌర్జన్యకాండ జరుగుతుందని.. అది కొడంగల్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, ఇతర ప్రాంతాల్లో కావొచ్చని.. ఏ రకంగా ప్రభుత్వం ధౌర్జన్యంగా ఈ రోజు దళితులు, గిరిజనులపై దాడి చేస్తూ వారిని హింసిస్తుందని.. కేసులు పెట్టి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నదో తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఒకవైపు హైదరాబాద్ ఫార్మా సిటీ పేరిట 14వేల ఎకరాలు సేకరించి మీ చేతులో పెట్టిన తర్వాత.. హైకోర్టులోనేమో ఫార్మాసిటీ ఉంటదని చెప్పి.. మళ్లీ 20 ఫార్మా విలేజ్‌లకు తెరలేపుతున్నారని ప్రశ్న తప్పకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. తప్పకుండా దళిత, గిరిజన, బలహీన వర్గాల రైతులు, సన్న, చిన్నకారు రైతులందరికి అండగా నిలబడి గట్టిగా మాట్లాడుతామన్నారు.
మా నాయకుడు పట్నం నరేందర్‌రెడ్డితో సహా 40 మంది రైతులు జైళ్లలో ఉన్నారని.. వారిని తక్షణమే విడుదల చేయాలని..భేషరతుగా క్షమాపణలు చెప్పి ఆ కేసులు ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. మా నాయకులు, శాసనసభలు, మండలి సభ్యులపై ఎక్కడికక్కడ వారి హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్నారు. మా నాయకురాలు కోవ లక్ష్మి సొంత నియోజకవర్గంలో ఓ అమ్మాయి గురుకుల పాఠశాలలో చనిపోతే పరామర్శకు బయలుదేరితో వారిని హౌస్ అరెస్ట్ చేశారన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని మూడు నాలుగు సార్లు హౌస్ అరెస్ట్ చేశారని.. దళితుల కోసం దళితబంధుపై మాట్లాడిన పాపానికి హౌస్ అరెస్ట్ చేశారన్నారు. ఇలా ఎక్కడికక్కడ రాష్ట్రవ్యాప్తంగా నిర్బంధ కాండ జరుగుతుందని.. రాజ్యంగ హక్కుల ఉల్లంఘనపై నిలదీస్తామని స్పష్టం చేశారు.