ఖైరతాబాద్, సెప్టెంబర్ 28 : గ్రూప్-1లో జరిగిన అవకతవకలపై సుప్రీం కోర్టుకు వెళ్తామని, మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేయడం కాదని, రీ ఎగ్జామ్ నిర్వహించాలని ఓయూ జేఏసీ నేత మోతీలాల్‌నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో గ్రూప్-1అభ్యర్థులు గంగా భాస్కర్, రమావత్ మోహన్, రమ్య, ఝాన్సీతో కలిసి ఆయన మాట్లాడారు. యూపీఎస్సీని అనుసరిస్తున్నామని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం అమలుచేయలేదని మండిపడ్డారు. రెండు హాల్‌టికెట్లు ఇవ్వడంతోనే టీజీపీఎస్సీ బండారం బయటపడిందని పేర్కొన్నారు. సింగిల్‌బెంచ్ తీర్పు వచ్చిన కొద్ది గంటల్లోనే నియామకాలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఆ తీర్పులో ఏమున్నది? తెలుగు మీడియం విద్యార్థుల గురించి ఏమైనా ప్రస్తావించారా? అనేది తేలాల్సి ఉన్నా, అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. 563 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసిన టీజీపీఎస్సీ వారి పూర్తి వివరాలను పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అడ్డదారిలో స్థానికేతరులు, అగ్రవర్ణాలకు కేటాయించిన విషయం వెలుగులోకి వస్తుందనే భయంతోనే ఆగమేఘాలపై నియామకపత్రాలు అందజేశారని పేర్కొన్నారు. తెలుగు మీడియం అభ్యర్థులకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. సమావేశంలో లక్ష్మి, దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.