ఆదిలాబాద్ : దేవరకోట దేవస్థానానికి రూ.70 లక్షల నిధులతో అభివృద్ధి చేశాం. భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులతో గురువారం ఉదయం దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.
వేకువజాము నుంచి వైకుంఠ ద్వారం నుంచి దర్శనం ఇస్తున్న స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు మంత్రికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు అని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా భక్తులు భగవంతుడుని దర్శించుకుంటున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిలాల్లని, కరోనా పూర్తిగా పోవాలని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో దేవాలయాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.
యాదాద్రి ఆలయం మార్చి 28 న ప్రారంభం కానుందని, పూర్తిగా కృష్ణ శిలలు రాతి కట్టడాలతో ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని మంత్రి తెలిపారు. ప్రజలందరికి వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.