కరీంనగర్ విద్యానగర్, సెప్టెంబర్ 29 : కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సభలో బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా పోరాడుతామని బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్లో పలు బీసీ సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హామీల అమలు విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏటా రూ.20 వేల కోట్ల బడ్జెట్ విడుదల చేస్తామని చెప్పి ఎందుకు మోసం చేశారని ప్రశ్నించారు. గత నెల 25న హైదర్‌గూడలోని కేంద్ర కార్యాలయంలో ఆమరణ దీక్ష చేపట్టిన తర్వా త పోలీసులు అరెస్ట్ చేసి అనేక ఇబ్బందులు పెట్టారని తెలిపారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత ఆమరణ దీక్ష విరమించినట్టు చెప్పా రు. దీక్ష విరమించి 20 రోజులు గడుస్తున్నదని, వెంటనే ప్రక్రియ చేపట్టకపోతే మళ్లీ ఆమరణ దీక్షకు సిద్ధమని హెచ్చరించారు.
భద్రాద్రిలో 4 నుంచి శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
భద్రాచలం, సెప్టెంబర్ 29 : భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వచ్చే నెల 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. తొమ్మిది రోజులపాటు రోజుకో అలంకారంలో శ్రీలక్ష్మీతాయారు అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 12న విజయదశమి సందర్భంగా భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం, విజయోత్సవం, ఆయుధపూజ, శ్రీరామలీలా మహోత్సవం నిర్వహిస్తారు. 17న శబరి స్మృతియాత్ర సైతం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆశ్వయుజ మాసంలో నిర్వహించే ఉత్సవాలకు సంబంధించిన నివేదికను ఆలయ ఈవో రమాదేవికి వైదిక బృందం అందజేశారు.