నల్లబెల్లి, ఆగస్టు 2: ఆధార్ నమోదు తప్పిదంతో రుణమాఫీ కాని రైతులకు న్యాయం చేస్తామని వరంగల్ జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ కీరూనాయక్ హామీ ఇచ్చారు. ‘ఒకరి ఆధార్.. మరొకరికి రుణం’ శీర్షికన జూలై 31న ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైన నేపథ్యంలో వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని డీసీసీబీ, కేజీబీ, యూనియన్ బ్యాంకులో జరిగిన ఆధార్ తప్పిదాలపై జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ శుక్రవారం విచారణ చేపట్టారు. పీఏసీఎస్ కార్యాలయంలో క్రాప్‌లోన్ తీసుకున్న రైతుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారుల తప్పిదం వల్ల 12 మంది రైతుల ఆధార్ నంబర్లు ఒకరివి మరొక రైతుకు నమోదు చేయడం వల్ల రుణమాఫీకి అనర్హులైనట్టు తెలిపారు. ఆధార్‌లో తప్పిదం వల్ల రుణమాఫీ వర్తించని ప్రతి రైతు సంబంధిత బ్యాంకుకు వెళ్లి వివరాలను 32 ఫార్మాట్ లో నమోదు చేయించాలని సూచించారు.