సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : ఎన్నో సంవత్సరాల నుంచి నాలా పరిసర ప్రాంత ప్రజలు ఎదురొంటున్న ముంపు సమస్యకు సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఎన్డీపీ) తో శాశ్వతంగా పరిషారం లభించనున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో నగరంలోని పలు ప్రాంతాలలో ఎస్ఎన్డీపీ కార్యక్రమం క్రింద చేపట్టిన నాలాల అభివృద్ధిలపై హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ సుదీర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాధ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సాయన్న, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఎస్ఎన్డీపీ ఈఎన్సీ జియా ఉద్దిన్, సీఈ కిషన్, వసంతలు పాల్గొన్నారు.
సుమారు 50 సంవత్సరాల నుంచి నగరంలోని అనేక ప్రాంతాలలో వర్షాకాలంలో వచ్చే వరదనీటితో నాలాల పరిసర కాలనీలు ముంపునకు గురై ఆయా ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మంత్రి తలసాని వివరించారు. పలు చోట్ల నాలాలపై ఆక్రమ నిర్మాణాలు చేపట్టగా, మరికొన్ని చోట్ల నాలాల వెడల్పు తగ్గిపోవడం వంటి కారణాలతో సాఫీగా నీరు ముందుకు సాగక వరదనీటి ముంపు సమస్య ఏర్పడుతుందని వివరించారు.
నాలాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ముంపు సమస్యకు శాశ్వత పరిషారం చూపాలనే ఉద్దేశంతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఎస్ఎన్డీపీ వ్యవస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి నాలాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఇందుకు గాను 858 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు.
ఎన్ఎన్డీపీ కార్యక్రమం క్రింద సికింద్రాబాద్ జోన్లో 8, ఖైరతాబాద్ జోన్లో 6 మొత్తం 14 పనులు మంజూరు కాగా, పనుల పురోగతిపై ఎన్ఎన్డీపీ ప్రాజెక్ట్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పనులు చేపట్టడంలో ఏమైనా సమస్యలు ఎదురయితే స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి లేదా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిషారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.