హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు కచ్చితంగా న్యాయం చేస్తామని, అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ప్రజాభవన్లో ప్రజావాణి సందర్భంగా తెలంగాణ స్టేట్ ఆటో అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్, బీఎంఎస్ అనుబంధ టీఎస్పీటీఎంఎం ఆధ్వర్యంలో పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణాలపై పునరాలోచన, బస్సుల సంఖ్య తగ్గించడం, ఓలా, ఉబర్, ర్యాపిడ్ బైక్ల అక్రమ వ్యాపారాన్ని నిషేధించడం వంటి డిమాండ్లను ఆటో యూనియన్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్టు తెలిపారు. త్వరలో ఆటో యూనియన్లతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటోడ్రైవర్లు ఇబ్బంది పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఆటో వాళ్లు తమ సోదరులే అని, వాళ్లకు కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రజావాణికి వేలాది దరఖాస్తులు
ప్రజావాణికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రజల సమస్యలను అధికారులు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణికి వచ్చిన వారిలో అత్యధికంగా అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణికి విశేష స్పందన వస్తున్నదని తెలిపారు. మంగళవారం ప్రజావాణికి 5,126 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు.