ఆదిలాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : రైతుల పక్షాన పోరాడితే ప్రభుత్వం పోలీసు కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నదని, అలాంటి కేసులకు భయపడేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జోగు రామన్న స్పష్టంచేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతు ల సమస్యల పరిష్కారానికి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. గురువారం ఆయన ఆదిలాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీసీఐ పత్తి కొనుగోళ్ల విషయంలో పూటకో నిబంధన విధిస్తూ రైతులను నష్టాలకు గురి చేస్తున్నదని ఆరోపించా రు.
తేమ శాతం పేరిట మద్దతు ధరకు పంట ను కొనుగోలు చేయడం లేదని విమర్శించా రు. రైతులు ప్రైవేటు వ్యాపారులకు 6,200 విక్రయిస్తూ క్వింటాల్‌కు రూ.1,900 చొప్పు న నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ ఇంటి ఎదుట ఆందోళన చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఆందోళన కార్యక్రమంలో పోలీసుల ప్రవర్తన వల్ల పలువురు కార్యకర్తలకు గాయాలైనట్టు తెలిపారు.