హైదరాబాద్, జనవరి17 (నమస్తే తెలంగాణ): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బొంద పెడతామని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను అటకెక్కించి బడుగు వర్గాలకు అన్యాయం చేసిందని శనివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ 19న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని బీసీలకు పిలుపునిచ్చారు.
బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు పోరాటాన్ని ఉధృతం చేయాలని బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు. 42శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ చేపట్టడంపై కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. 60 శాతం జనాభా ఉన్న బీసీలకు కేవలం 38 స్థానాలనే కేటాయించడం ఎలా న్యాయం అవుతుందని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మున్సిపల్ ఎన్నికల్లోనూ మరోమారు మోసం చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని, లేదంటే బీసీ సమాజం నుంచి వ్యతిరేకత తప్పదని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు.