హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వీలైనంత తొందరగా రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొస్తామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార చెప్పారు. శనివారం ప్రజాభవన్‌లో జస్టిస్ ఫర్ రోహిత్ వేముల క్యాంపెయిన్ కమిటీ సభ్యులు భట్టివిక్రమార్కతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టం తీసుకురావాలంటూ దేశ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కూడా సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారని గుర్తుచేశారు. సీఎంతో చర్చించి రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని భట్టి తెలిపారు. క్యాంపెయిన్ కమిటీ రూపొందించిన ముసాయిదాను కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా కొన్ని విజ్ఞప్తులు చేశారు. రోహిత్ కేసును పారదర్శకంగా విచారణ జరిపించాలని కోరారు. రోహిత్ మరణం తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 50 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లపై నాన్ బె యిలబుల్ కేసులు నమోదయ్యాయని, వాటినుంచి వారికి విముక్తి కల్పించాలని కోరారు.