KTR | జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని మామిడి రైతులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. మామిడి రైతులను దృష్టిలో ఉంచుకొని జగిత్యాలకు పెప్సీ, కోకాకోలా కంపెనీలను తీసుకొచ్చి మేలు చేస్తాం. ఆ బాధ్యత తనది అని కేటీఆర్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లాలో ఎస్పీ కార్యాలయం, డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్రంలో అతిపెద్ద డబుల్ బెడ్రూం కాలనీ జగిత్యాల నియోజకవర్గంలోనే ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్కు తేడా ఏందంటే.. నూకపల్లిలో కేసీఆర్ నగర్‌కు పోయేటప్పుడు నాలుగైదు డబ్బా ఇండ్లు కనబడుతాయి. కాంగ్రెస్ పాలనకు ఆ డబ్బా ఇండ్లు నిదర్శనం. కేసీఆర్ పని తీరుకు ఆ డబుల్ బెడ్రూం ఇండ్లు నిదర్శనం. ఎవరికి ఓటేయాలి.. ఎందుకు ఓటేయాలి.. అని ఆలోచించే ముందు ఒక్కసారి ఆ కాలనీకి వెళ్లండి. కాంగ్రెస్ పరిపాలన ఎట్ల ఉండే.. బీఆర్ఎస్ పరిపాలన ఎట్ల ఉండే అని తెలుస్తది. జిల్లా ఎస్పీఆఫీసు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఇది వరకు ఇక్కడ పని చేసిన వ్యక్తులు, మంత్రిగా పని చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. ఒక మంత్రిగా ఉన్నప్పుడు కానీ పనులు.. ఎమ్మెల్యేగా సంజయ్ చేసి చూపించారు. కలెక్టర్‌ను, ఎస్పీని మీ ముందుకే తీసుకొచ్చాం. జగిత్యాల ప్రజలకు అందుబాటులో అధునాత సదుపాయాలతో కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు నిర్మించుకుని ప్రారంభించుకున్నాం. కరీంనగర్‌కు పోవాల్సిన అవసరం లేదు. ఆగమయ్యే పరిస్థితి లేదు. పరిపాలన మీ ముంగిట్లో మీ గడప వద్దకు వచ్చింది. జూనియర్, డిగ్రీ కాలేజీల కోసం ధర్నా చేసిన జగిత్యాలలో మెడికల్ కాలేజీ వస్తదని అనుకున్నారా? ఇవాళ మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం. కాంగ్రెస్ పార్టీకి చెందిన జీవన్ రెడ్డి ఏం చేయలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందన్నారు కేటీఆర్.
డాక్టర్‌గా సంజయ్ ఎన్ని సేవలు చేశాడో మీకు బాగా తెలుసు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఉచిత కంటి ఆపరేషన్లు చేశారు. బ్రహ్మాండమైన సేవ చేశారు. మంచి పేరు ఉంది కాబట్టి కేసీఆర్ పిలిచి టికెట్ ఇచ్చారు. మంత్రులు చేయలేని పనులు సంజయ్ చేశారు. జగిత్యాల మాస్టర్ ప్లాన్ మంచిగా చేసుకుందామనే లోపు కొందరు రెచ్చగొట్టి ఆగమాగం చేశారు. అయినప్పటికీ రైతులకు నష్టం లేకుండా జగిత్యాల మాస్టర్ ప్లాన్ చేసుకోవాలి. 1956లోనే మున్సిపాలిటీగా ఉన్న జగిత్యాల స్థాయిని కాంగ్రెస్ ప్రభుత్వం దిగజార్చింది. కానీ బీఆర్ఎస్ పార్టీ జగిత్యాలను జిల్లా చేసి మళ్లీ దాని స్థాయిని పెంచారు. రైతులకు నష్టం కాకుండా మాస్టర్ ప్లాన్ చేస్తాం. పట్టణానికి పనికి వచ్చే విధంగా పట్టణ ప్రణాళికను బలోపేతం చేస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తప్పకుండా చేస్తాం అని కేటీఆర్ హామీ ఇచ్చారు.