బెల్లంపల్లి : ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ (MLA Gaddam Vinod ) ఇంటిని ముట్టడిస్తామని బీఆర్ఎస్ నాయకులు( BRS Leaders) హెచ్చరించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో భూ కబ్జాలు ( Land grabbing ) , ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ఎదుట ధర్నా( Dharna ) నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ ( Battula Sudarsan), బీఆర్ఎస్ పట్టణ వర్కింగ్ నూనెటి సత్యనారాయణ ( Satyanarayana) మాట్లాడారు. నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్లను బహిరంగా వేలం వేసి కాంగ్రెస్ నాయకులు విక్రయిస్తున్నా స్థానిక ఎమ్మెల్యే మాత్రం తనకు ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.
ప్రజా సమస్యలపై పట్టించుకోకపోతే హైదరాబాదులోని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఇంటి మందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. కన్నాల శివారులో భూములను కబ్జా చేసుకుంటున్నా ఎమ్మెల్యే గడ్డం వినోద్ నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి జరిగిందని ఆపార్టీకి చెందిన నాయకులే సమావేశాలు నిర్వహించి చెబుతుండడం
వారి అవినీతికి అద్దంపడుతోందని విమర్శించారు. అవినీతికి పాల్పడిన నాయకులను పార్టీ నుంచి బహిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు.
అవినీతి, అక్రమాలపై ఎమ్మెల్యే వినోద్ స్పందించాలని అధికార పార్టీ నాయకులే ప్రకటనలు చేస్తున్నా ఎమ్మెల్యే మాత్రం ఇటు వైపు కన్నెత్తిచూడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెడ్ రూమ్ ఇళ్లకు అధికార పార్టీ నాయకులు రూ. 3 లక్షలకు బహిరంగ వేలం వేస్తున్నారని ఆరోపించారు.
బెల్లంపల్లిలో పీఏల రాజ్యం కొనసాగుతోందని విమర్శించారు. పీఏలు ఏది చెబితే అదే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ లలో నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు వెడల్పు బాదితులకు పునారావాసం కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు.