నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 6: లోవోల్టేజీ సమస్యను నివారించాలని మంగళవారం కూడా రైతులు పలు జిల్లాల్లో సబ్స్టేషన్లను ముట్టడించారు. రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. వ్యవసాయానికి 24గంటల నాణ్యమైన కరెంట్‌ను అందించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం గాగిళ్లాపూర్‌లో రైతులు సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వచ్చిపోయే కరెంట్‌తో తమ పొలాలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రోజులో 9గంటల కరెంట్ మాత్రమే సరఫరా అవుతున్నదని, పగటి పూట మాత్రమే కరెంట్ వస్తుండటంతో ఎండలకు నీళ్లు పారడం లేదని ఆవేదన చెందారు. కరెంట్ కోతలను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా పుల్కల్లోని 33 కేవీ సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల మహాధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి ఆరు గంటల విద్యుత్తు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని మండిపడ్డారు. పొట్ట దశలో ఉన్న వరికి ఎక్కువ నీరు అవసరమవుతుందని, దానికి కరెంటు లేక రైతులు కన్నీరు కారుస్తున్నారని తెలిపారు.
కరెంటియ్యకపోతే వారి ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని హెచ్చరించారు. కరెంట్ కోతలను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం కరస్‌గుత్తి సబ్‌స్టేషన్ ముట్టడించారు. అనంతరం రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంటు ఇచ్చిందని అన్నారు. ప్రభుత్వం కనీసం 6 గంటలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని మండిపడ్డారు. కరెంట్ సరిగ్గా రాక పంటలు ఎండుతున్నాయని అన్నారు. నిజాంపేట మండలంలో రైతు పొలానికి నిప్పు పెట్టుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడ సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు, రైతులు ధర్నా చేపట్టారు. విద్యుత్తు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రెడ్లవాడ, గొట్లకొండ, వెంకటాపురం గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. కనీసం నాలుగైదు గంటల కరెంట్ కూడా వస్తలేదని మండిపడ్డారు. రెడ్లవాడ సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఆపరేటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తక్షణమే వారిని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.