హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగా ణ): కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, అప్పుడు కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ సాధించి తీరుతామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కాజీపేటకు కోచ్‌ఫ్యాక్టరీ సాధించే వరకు బీఆర్ఎస్ వదిలిపెట్టదని చెప్పారు. కేంద్రం మెడలు ఎలా వంచాలో తెలంగాణకు తెలుసని స్పష్టంచేశారు. దశాబ్దాలుగా కాజీపేటకు జరుగుతున్న అన్యాయాన్ని ఇక సహించేది లేదని గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. దేశంలో కోచ్ ఫ్యాక్టరీలకు డిమాండ్ లేదని పార్లమెంట్లో చెప్పిన కేంద్రం.. మహారాష్ట్ర, గుజరాత్లో ఎలా ఏర్పా టు చేస్తున్నదని ప్రశ్నించారు.
కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీని విస్మరించి, తొలుత పీవోహెచ్ వర్షాపు, ఆ తర్వాత వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతామంటూ కాజీపేటకు వస్తున్న మోదీ మోసాన్ని వరంగల్ ప్రజలు గమనిస్తున్నారన్నారు. సరైన సమయంలో బీజేపీకి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కోచ్‌ఫ్యాక్టరీ సాధనకు ఉద్యమిస్తామని వినోద్ స్పష్టంచేశారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పీవోహెచ్ వర్షాపు ఏర్పా టుకు కేంద్రం ముందుకు రావడం దారుణమని మండిపడ్డారు. తెలంగాణకు కావలసింది కోచ్ ఫ్యాక్టరీ మాత్రమేనని స్పష్టంచేశారు.