మదురై: దేశంలో ‘కాక్రోచ్’ ఉద్యమం ఉధృతమవుతున్నట్టు కన్పిస్తున్నది. తమకు ఉద్యోగాలు కల్పించాలంటూ తమిళనాడులోని మదురైలో నిరుద్యోగులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. వినూత్నంగా, భావోద్వేగంతో మొట్టమొదటి సారిగా యువత ‘బొద్దింకల ర్యాలీ’ని నిర్వహించారు. నిరుద్యోగ సమస్యకు, నిరుద్యోగులకు వ్యతిరేకంగా యువతను బొద్దింకలంటూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ ర్యాలీ జరిపారు. ఈ ర్యాలీని డెమోక్రాటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్ఐ), ఎస్ఎఫ్ఐ సంయుక్తంగా నిర్వహించగా, కాక్రోచ్ జనతా పార్టీని అభిమానిస్తున్న పలువురు మద్దతు తెలిపారు. వందలాదిమంది విద్యావంతులు, గ్రాడ్యుయేట్లు మాకు పని కావాలి, మాకు జీవితం కావాలి, మాకు గౌరవం కావాలి అని రాసి ఉన్న ప్లకార్డులు ధరించి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ‘నిరుద్యోగ బొద్దింకల ప్రదర్శన’ అని నిరసనకారులు ప్రదర్శించిన పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేసిన మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. కాగా, మదురై ఉద్యమాన్ని ప్రతిబింబిస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విల్లిపురంలోని బస్‌స్టాండ్ వద్ద సంతకాల ఉద్యమం ప్రారంభమైంది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కాక్రోచ్’ వేదికకు పాకిస్థాన్ సామాజిక మాధ్యమం మద్దతు ఉందని, బిలియనీర్ దాత జార్జ్ సొరోస్ నెట్‌వర్క్‌లతో సంబంధం ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన ఆరోపణలను కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తీవ్రంగా తిప్పికొట్టింది. రిజిజు ఎక్స్‌లో చేసిన వ్యాఖ్యలపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పందిస్తూ ఆ ప్లాట్‌ఫామ్ వినియోగదారుల గణాంకాలకు సంబంధించిన స్క్రీన్ రికార్డింగ్‌గా పేర్కొంటూ ఒక వీడియోను పంచుకున్నారు. ఈ వేదిక ఫాలోవర్లలో 94 శాతం మంది భారతీయులేనని ఆయన స్పష్టం చేశారు. అలాంటప్పుడు భారతీయులను పాకిస్థాన్ దేశీయులుగా మీరు ఎందుకు ముద్ర వేస్తున్నారని ఆయన మంత్రిని ప్రశ్నించారు. ‘భారత దేశంలో తగినంత జనాభా, అత్యంత ఉత్సాహవంతమైన యువత ఉన్నారు. వీరు నిజమైన, విలువైన ఫాలోవర్లు కాగలరు. భారత దేశ వ్యతిరేక ముఠా నుంచి ఆమోదం పొందాల్సిన అవసరం లేదు’ అని కిరణ్ రిజిజు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తులపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. సామాజిక మాధ్యమంలో పలువురిని ఆకర్షిస్తున్న ఈ వ్యంగ్య రాజకీయ పార్టీ నకిలీ లా డిగ్రీలు ఉపయోగించడమే కాక, సుప్రీంకోర్టు గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నదని, న్యాయవాదులుగా, న్యాయ నిపుణులుగా నటిస్తున్న వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు.