హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఓబీసీల డిమాండ్ల సాధనకు దేశవ్యాప్తంగా ఉద్యమించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో బుధవారం ఓబీసీ డిమాండ్లపై బీసీ మేధావుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని కోరారు.
ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. బీసీ బిల్లుకు ఇది అనువైన సమయమని, బీఆర్ఎస్ పార్టీ బీసీ వాదానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీలు అప్పలనాయుడు, అంబికా లక్ష్మీనారాయణ, నాగరాజు, రాజ్యసభ సభ్యుడు మస్తాన్‌రావు, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్, ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు ఎన్ మారేశ్, దక్షిణాది రాష్ర్టాల ఓబీసీ సంఘం అధ్యక్షుడు జబ్బల శ్రీనివాస్, పీతాని ప్రసాద్, రాజ్‌కుమార్, శ్రీనివాసరావు, భూపే సాగర్, విపుల్, భోగి రమణ, శశి భార్గవి, కోటేశ్వరరావు, రాజశేఖర్, సుభాశ్ యాదవ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.