ఆదిలాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లోని గర్భిణులకు వైద్యసేవలు, పౌష్టికాహారం అందేలా ఆదిలాబాద్ జిల్లా వైద్యశాఖ ‘తల్లి పిలుపు’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారంచుట్టింది. రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న ఆదివాసీగూడేలు, తండాలకు చెందిన గర్భిణులకు కాన్పు సమయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది. ఇందుకోసం జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. 2018లో ప్రారంభించింది. వైద్యసిబ్బంది మొదట గర్భిణుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. వారానికోసారి గర్భిణులకు ఫోన్‌చేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొంటారు. హిమోగ్లోబిన్ శాతం, థైరాయిడ్, బీపీ తదితర వివరాలను ఆరాతీస్తారు. అంగన్వాడీల్లో అందించే పౌష్టికాహారం గురించి అవగాహన కల్పిస్తారు. 3, 5, 7, 9వ నెలల్లో స్కానింగ్ చేయించుకొనేలా ప్రోత్సహిస్తారు. తీసుకోవాల్సిన టీకాల గురించి తెలియజేస్తారు. పీహెచ్సీలో వైద్యులు వీరిని పరీక్షించి సమస్యలను కాల్‌సెంటర్ సిబ్బందికి తెలియజేస్తారు. ప్రసవ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా రిమ్స్ బ్లండ్బ్యాం కు నుంచి రక్తం అందేలా చర్యలు తీసుకుంటారు.
‘తల్లి పిలుపు’లో భాగంగా ఇప్పటివరకు 5 వేల మంది ఈ సేవలను సద్వినియోగం చేసుకొన్నారు. రక్తహీనతతో బాధపడుతున్న 896 మందికి రక్తం అందించారు. ఈ కార్యక్రమం ప్రారంభమయ్యాక మాతాశిశు మరణాలు తగ్గాయని వైద్యాధికారులు పేర్కొన్నారు. గర్భిణులు కూడా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి తమ ఆరోగ్య సమస్యలను తెలియజేసే అవకాశం కల్పించారు. రవాణా సమస్యలు ఉన్న గ్రామాల్లోని గర్భిణులు, రిస్క్ ఉన్న కేసులను ప్రసవ సమయం కంటే పది రోజుల ముందే దవాఖానకు తీసుకొచ్చేలా చూడటంతోపాటు వైద్యం అందేలా పర్యవేక్షిస్తారు.
తల్లిపిలుపు కాల్ సెంటర్ సిబ్బంది వారానికోసారి గర్భిణులకు ఫోన్ చేస్తారు. ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తారు. కాల్ సెంటర్ సిబ్బంది 24 గంటలపాటు అందుబాటులో ఉంటారు. అవసరమైతే వైద్యం కోసం 102,108 అంబులెన్స్‌ల ద్వారా దవాఖానకు తరలిస్తాం. రక్తహీనతతో బాధపడుతున్న వారిని రిమ్స్‌కు తీసుకొచ్చి రక్తం అందిస్తాం. స్కానింగ్ క్రమంగా చేయించుకునేలా చూస్తాం. తల్లి, శిశు మరణాల నివారణకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతున్నది.
– నరేందర్ రాథోడ్. జిల్లా వైద్యాధికారి