హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): తమకు పేస్కేల్ వర్తింపజేసేందుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్‌కు తామంతా రుణపడి ఉంటామని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఉద్యోగులు కృతజ్ఞత చాటుకున్నారు. హైదరాబాద్‌లోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి వారు క్షీరాభిషేకం చేశారు. అనంతరం సెర్ప్ ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. పేసేల్ అమలుతో ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరుగుతాయని, ప్రభుత్వంపై రూ.58 కోట్ల అదనపు భారం పడుతుందని మంత్రి తెలిపారు.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెంచిన పేసేల్ అమలులోకి వస్తుందని, ఇందుకోసం రూ.176 కోట్ల నుంచి రూ.234 కోట్లకు బడ్జెట్‌ను పెంచామని వివరించారు. తమ కోర్కె నెరవేరేందుకు సహకరించిన మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు గంగాధర్ రెడ్డి, నర్సయ్య, సుభాష్, జానయ్య, సురేఖ, వెంకట్, గిరి, మధు పాల్గొన్నారు. తామంతా ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి గ్రామీణ పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని చెప్పారు.