హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ర్టంలో రైల్వే సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎంపీలు దీవకొండ దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు వినతిపత్రం అందజేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో రైల్వేస్టేష్టన్ ఏర్పాటు, పలు రైళ్ల పునరుద్ధరణ తదితర అంశాలను వినతిపత్రంలో పేర్కొన్నారు. మనోహరాబాద్-కొత్తపల్లి నూతన రైల్వేలైన్ పనుల్లో భాగంగా చిన్నకోడురు వద్ద స్టేషన్ ఏర్పాటుచేయాలని, ఖమ్మం జిల్లాలోని గాంధీపురం రైల్వేస్టేషన్‌కు మరమ్మతులు చేయాలని కోరారు. 12746 నంబర్ రైలు అక్కడ ఆగకపోవడం వల్ల హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, దాన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరారు. డోర్నకల్-భద్రాచలం రైలును కొవిడ్ సమయంలో రద్దు చేశారని దాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తిచేశారు. బెలగాం-మణుగూరు ఎక్స్‌ప్రెస్‌ను ప్రతి రోజూ నడపాలని, గయా-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ను ఖమ్మం రైల్వే స్టేషన్లో ఆగేలా చూడాలని కోరారు.
కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయండి
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్‌తో కలిసి సోమవారం ఢిల్లీలోని రైల్ నిలయంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. బయ్యారంలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని వినతిపత్రం అందజేశారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు తెలంగాణ ప్రజల యాభై ఏండ్ల కల అని చెప్పారు. వెంటనే దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ఈ కోచ్ ఫ్యాక్టరీలో 60 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. కాగా, ఇందుకు రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.