హైదరాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): చివరి విడతగా 3.13 లక్షల మంది రైతులకు రూ.2,747 కోట్ల రుణమాఫీని పూర్తి చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీని పూర్తిచేసినట్టు స్పష్టంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు నాలుగు విడతల్లో 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్లు రుణమాఫీ చేసినట్టు వివరించారు. గతంలో రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవసరమని చెప్పి, ఇప్పుడు రూ.20 వేల కోట్లే చేయడంపై మీడి యా ప్రశ్నించగా.. బ్యాంకుల తప్పిదాల వల్ల అంచనాలు పెరిగాయని తెలిపారు.
లాంగ్‌టర్మ్ రుణాలను కూడా కలిపి బ్యాంకులు అం చనా వేశాయని, తర్వాత తాము నిర్దిష్ట నిబంధనలు ఇవ్వగా వాటి ప్రకారం అంచనాలు తగ్గాయని స్పష్టంచేశారు. ఎక్కడో ఒకరికో ఇద్దరికో తప్ప రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ పూర్తయిందని చెప్పారు. రూ.2 లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. రూ.2 లక్షలకుపైగా రుణం గల రైతులు పై మొత్తాన్ని చెల్లించేందుకు బ్యాంకు లు సహకరించడం లేదని మీడియా సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. సీఎం స్పందిస్తూ ‘అది బ్యాంకుల పని కాదని, అది రైతుల పని అని, వచ్చినోళ్లకు, కట్టినోళ్ల నుంచి తీసుకుంటార’ని సమాధానమిచ్చారు.
సంక్రాంతి తర్వాత రైతుభరోసా
సంక్రాంతి తర్వాత రైతుభరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సోనియాగాంధీ గ్యారెంటీగా చెప్తున్నానని, రైతుభరోసా ఇచ్చే బాధ్యత తమదని అన్నారు. రైతుభరోసాపై తప్పుడు ప్రచారాలు, ఎవరి మాటలూ నమ్మొద్దని రైతులకు సూచించారు. రైతుభరోసా విధివిధానాల ఖరారుకు ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఉపసంఘం వేశామని, ఈ కమిటీ త్వరలోనే నివేదిక ఇస్తుందని తెలిపారు. డిసెంబర్లో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో ఈ నివేదికపై చర్చించి, విధి విధానాలు ఖరారు చేసి రైతుభరోసా ఇస్తామని పేర్కొన్నారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం వానకాలం రైతుబంధును ఎగ్గొడితే, తాము చెల్లించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వానకాలంలో రైతుభరోసా చెల్లించకపోవడంపై మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానం దాటవేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 31 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్టు తెలిపారు. సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నట్టు తెలిపారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యంతో రేషన్‌షాపుల్లో పేదలకు సన్నబియ్యం ఇస్తామని చెప్పారు. అందుకే రైతులు హెచ్ఎంటీ, తెలంగాణ సోనా, బీపీటీ రకాలను ఎక్కువగా సాగు చేయాలని సూచించారు.