Revanth Reddy | హైదరాబాద్, మార్చి 7 ( నమస్తే తెలంగాణ ) : ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని తెలంగాణలో ప్రజలు గళమెత్తుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభ ఎన్నికల వేళ అధికారం కోసమే గ్యారంటీల హామీలు ఇచ్చామని, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ.500 కోట్లు కూడా పెట్టుబడి పెట్టలేని పరిస్థితి నెలకొన్నదని చెప్పుకొచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో ఓ చానల్ నిర్వహించిన సదస్సులో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్‌లు అడిగిన పలు ప్రశ్నలకు రేవంత్‌రెడ్డి సమాధానమిచ్చారు. హైదరాబాద్‌ను గతంలో చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ అభివృద్ది చేశారు కదా అని జర్నలిస్ట్ ప్రశ్నించగా హైదరాబాద్‌లో గోల్కొండ, చార్మినార్‌ను చంద్రబాబు నిర్మించారా అంటూ ఎదురు ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. పాలసీల విషయంలో మాత్రమే ఆయనతో విభేదిస్తానని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వానికి రూ. 3.75 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసి కూడా రైతులకు, ప్రజలకు, యువతకు హామీలు ఎలా ఇచ్చారని జర్నలిస్ట్ ప్రశ్నించగా ఎన్నికల నాటి పరిస్థితుల కారణంగా హామీలు ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. అధికార రేసులో భాగంగానే ప్రజలకు గ్యారంటీ హామీలు ఇచ్చినట్టు స్పష్టంచేశారు. మరి అధికారంలోకి వచ్చాక అప్పులున్నాయని తెలిసి కూడా తొలి బడ్జెట్లో హామీల అమలు కోసం రూ.50వేల కోట్లు ఎలా కేటాయించారని రిపోర్టర్ ప్రశ్నించగా రేవంత్‌రెడ్డి సమాధానం దాటవేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం తరఫున కనీసం రూ.500 కోట్ల పెట్టుబడి కూడా పెట్టే పరిస్థితి లేదని చెప్పారు. రాజకీయలబ్ధి కోసమే కేంద్ర ప్రభు త్వం నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని ఎత్తుకుందని ఆరోపించారు. హిందీ జాతీయ భాష కాదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి పేరును ఆఖరికి మంత్రివర్గ సహచరులు కూడా హఠాత్తుగా చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్‌రెడ్డి పేరును మర్చిపోయారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన సందర్భంలో ‘గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్’ అంటూ సంబోధించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినోభానగర్‌లో సీతారామ ప్రాజెక్టు మెయిన్ కెనాల్ నుంచి వైరా రిజర్వాయర్‌కు బుధవారం నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సీఎం రేవంత్‌రెడ్డి పేరు చెప్పలేకపోయారు. ముఖ్యమంత్రి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అన్న అంటూ తడబడ్డారు. ఫిబ్రవరి 28న గచ్చిబౌలిలో డీఆర్డీవో కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. అక్కడ పరేడ్ సందర్భంగా యాంకర్ సీఎం రేవంత్‌రెడ్డి పేరు మర్చిపోయారు. రాజ్‌నాథ్‌సింగ్ కూడా రేవంత్‌రెడ్డి పేరును ఏ రేవ్నాథ్ జీ రెడ్డి అంటూ పలికారు. అంతకుముందే పుష్ప-2 సినిమా ఫంక్షన్లో సినీనటుడు అల్లు అర్జున్, ప్రెస్మీట్లలో మంత్రి జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, తెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమంలో వ్యాఖ్యాత గా వ్యవహరించిన నటుడు బాలాదిత్య సీఎం పేరును మర్చిపోయారు.
సీఎం రేవంత్‌రెడ్డి పేరును వివిధ వేదికలపై మర్చిపోతున్నారు. ఢిల్లీలో జరిగిన సదస్సులో ఓ జర్నలిస్ట్ రేవంత్‌రెడ్డి పేరును చెప్పలేకపోయారు. సీఎం రేవంత్‌ని సదరు జర్నలిస్ట్ ‘మిస్టర్ మోదీ’ అని సం బోధించారు. మళ్లీ తేరుకొని ‘మిస్టర్ రెడ్డి’ అని సవరించుకున్నారు. దీంతో రేవంత్‌రెడ్డి కూడా నవ్వుకున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో సెటైర్లు చక్కర్లు కొడుతున్నాయి. తను భడే భాయ్ అని పిలుచుకునే మోదీ పేరుతో పిలిచినందుకు రేవంత్ మురిసిపోతున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.