హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అతిపెద్ద పశు, జీవ సంపద ఉన్న దేశం భారత్. ప్రపంచ పాల ఉత్పత్తిలోనూ భారత్‌దే అగ్రస్థానం. దేశానికి ఆ కీర్తి దక్కడంలో తెలంగాణ వాటానే అత్యధికం. మంగళవారం రాష్ట్ర ప్రణాళిక శాఖ విడుదల చేసిన ‘తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్-2022’లో పేర్కొన్న గణాంకాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలతో పశు సంపదలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. గొర్రెల పెంపకంలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ ప్లేస్‌లో ఉన్నది.
పౌల్ట్రీ పరిశ్రమలో మూడో స్థానంలో నిలిచింది. పాల ఉత్పత్తి, బర్రెలు, మేకలు, చేపల పెంపకం ఇలా అన్నింటిలోనూ రాష్ట్రం ముందు వరుసలో నిలిచింది. పాలు, మాంసం, గుడ్లు సరఫరా చేయడంలోనూ తెలంగాణ ముందు వరుసలోనే ఉన్నది. 2014-15వ సంవత్సరంలో 4,207.26 టన్నుల పాలను ఉత్పత్తి చేస్తే.. 2020-21లో 5,765.19 టన్నులకు పెరిగింది. మాంసం 505.05 టన్నులు ఉండగా.. 1,014.73కి చేరింది. కోడిగుడ్ల ఉత్పత్తి 1,061.85 కోట్లు ఉండగా.. 1,725.06కి పెరిగింది. 2014-15లో చేపల ఉత్పత్తి 2,60,010 టన్నులు ఉండగా 2012-22లో 3,76,142 టన్నులకు పెరిగింది. రొయ్యలు 8,352 టన్నులు ఉండగా.. 13,827 టన్నులకు చేరింది.
రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. 2014-15తో పోలిస్తే 2021-22 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా వార్షిక సగటు భూగర్భజలాల్లో గొప్ప పెరుగుదల కనిపించింది. మంగళవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం విడుదల చేసిన ‘తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్ నివేదిక’ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2014-15లో రాష్ట్ర భూగర్భ జలాల సగటు వార్షిక నీటిమట్టం 10.88 మీటర్లు ఉండగా.. 2021-22 నాటికి 6.57 మీటర్లకు పెరిగినట్టు నివేదిక తెలిపింది.