హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ర్టాలకు రోల్ మాడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరొన్నారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైనాన్స్ సమ్మిట్ 2026’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రభుత్వ పౌర సేవల్ని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా ప్రజల ముంగిటకే చేర్చేలా ఒక ప్రత్యేక కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఊహించని వేగంతో డిజిటల్ వైపు దూసుకుపోతున్నదని, సంప్రదాయ పద్ధతుల స్థానంలో వ్యవస్థను రీ-డిఫైన్ చేసే సరికొత్త డిజిటల్ ఈక్వేషన్స్ తెరపైకి వచ్చాయన్నారు.
ఈ గ్లోబల్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో భారత్ సాధిస్తున్న ప్రగతికి తెలంగాణ ఒక గ్రోత్ ఇంజిన్‌లా మారిందని… భావితరాల అవసరాలకు అనుగుణంగా నెక్ట్స్ జనరేషన్ ఇన్నోవేషన్స్, టాలెంట్, ఎకనామిక్ గ్రోత్.. ఈ మూడింటినీ నడిపించే ఒక బలమైన ఎకోసిస్టంను ఇప్పటి నుంచే అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వివరించారు. ఏఐ, డాటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీస్ వల్ల ఫైనాన్స్ రంగంలో సరికొత్త అవకాశాలు.. అదే స్థాయిలో సైబర్ మోసాలు, డీప్ ఫేక్స్, సైబర్ అరెస్ట్, క్రిప్టో ఫ్రాడ్స్ తదితర సవాళ్లు కూడా తెరపైకి వచ్చాయన్నారు. సీఏలు కేవలం ఫైనాన్షియల్ ఆడిటింగ్‌కే పరిమితం కాకుం డా.. ‘సైబర్ అష్యూరెన్స్’కూ ప్రాధాన్యమివ్వాల్సిన అవసరముందని సూచించారు.
హైదరాబాద్‌లో టెస్లా షోరూం
టెస్లా త్వరలో హైదరాబాద్‌లో షోరూంను తెరువడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు శుక్రవారం సంస్థ ఇండియా ప్రతినిధులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో భేటీ అనంతరం ఇక్కడ అమ్మకాలు ప్రారంభించేందుకు ఆసక్తితో ఉన్నట్టు వెల్లడించారు.