కౌటాల/పెంచికల్పేట్, మే 29 : ‘ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇకపై ఆర్థికపరమైన పనులు చేపట్టలేం’ అంటూ ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తేల్చిచెప్పారు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో ఎంపీవో మహేందర్రెడ్డి, పెంచికల్పేట్లో ఎంపీడీవో ఆల్బర్ట్కు వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 నెలలుగా తాము చేసిన పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి బిల్లులు రాలేదని, దీంతో ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటి వరకు సొంత డబ్బులు పెట్టుకొని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశామని, ఇక ఆ స్థోమత తమకు లేదని స్పష్టంచేశారు. పెండింగ్ బిల్లులతో పాటు రాబోయే వానకాలం నిధులు ఇస్తేనే ఆర్థికపరమైన పనులు చేస్తామని స్పష్టంచేశారు.