హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): కరోనా.. మనిషికి కొత్త జీవితాన్ని పరిచయం చేసింది. అలవాట్లను సమూలంగా మార్చేసింది. జేబులోంచి డబ్బులు తీయ డానికే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి నుంచి.. డబ్బులు ఖర్చయినా పర్వాలేదు ఆరోగ్యమే ముఖ్యం అనే స్థితి వచ్చేసింది. దోస్తుల కాలక్షేపం కాస్తా.. ఫోన్లకు పరిమితమైపోయింది. ప్రపంచ జీవన గమనం కరోనాకు ముందు, కరోనా తర్వాత అని చెప్పేంతగా మారిపోయింది. ఇటీవలే వే2 న్యూస్ నిర్వహించిన సర్వేలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ, ఏపీలో సుమారు 3.50 లక్షల మందిని వే2 న్యూస్ సర్వే చేసింది. 88 శాతం మంది పురుషులు, 12 శాతం స్త్రీలు సర్వేలో పాల్గొన్నారు. అందులో సుమారు 70 శాతం మంది 21-30 ఏండ్ల వయసు వారు తమ అభిప్రాయాలను పంచుకొన్నారు.
కరోనా అనంతరం రైళ్లలో, బస్సుల్లో ఎక్కువ మందితో కలిసి ప్రయాణించేందుకు ఇష్టపడట్లేదు. అవకాశం ఉన్నంతలో సొంత వాహనాన్ని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం 50 శాతం మంది సొంత వాహనాల్లోనే ప్రయాణిస్తున్నారని సర్వేలో తేలింది. కేవలం 26 శాతం మంది మాత్రమే రైలులో ప్రయాణిస్తున్నట్టు సర్వే పేర్కొన్నది. 63 శాతం మంది ఖాళీ సమయాల్లో మొబైల్ ఫోన్ చూడడంలో మునిగిపోతున్నారు. అందులో 51 శాతం మంది ఇన్‌స్టా, ఫేస్బుక్, యూట్యూబ్స్‌లో రీల్స్, వీడియోలు చూస్తూ కాలాన్ని గడిపేస్తున్నారు. మరో 29 శాతం మంది మొబైల్లో ఓటీటీ వేదికగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూస్తున్నారు. ఇక.. షాపింగ్, నిత్యావసరాల కొనుగోళ్లు వంటివన్నీ మొబైల్లోనే చేసేస్తున్నారు. ప్రస్తుతం 30 శాతం మంది ఆన్లైన్లోనే అన్నీ కొనేస్తున్నట్టు సర్వేలో తేలింది.