కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 27: మార్చిలోనే ఎండలు మండుతుండగా, పాతాలగంగ శరవేగంగా భూగర్భానికి పరుగులు తీస్తుంది. ప్రజలు తాగునీటికి సైతం తిప్పలు పడుతుండగా, కరీంనగర్ (Karimnagar) జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రస్థాయికి చేరింది. వాణిజ్యపరమైన అవసరాల పేరిట కొందరు నీటిని దుర్వినియోగం చేస్తుండడంతో వేసవి ఆరంభంలోనే కరువు కరాళ నృత్యం చేస్తున్నది. వాల్టా చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన సర్కారు చోద్యం చూస్తున్నది. భూగర్భ జలాల పరిరక్షణ, నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కమిటీలు వేసి చేతులు దులుపుకొన్నది. ఈ పరిస్థితుల్లో గుక్కెడు నీరూ కూడా లభించుడు గగన కుసుమం కావటంతో, నీటివనరుల పరిరక్షణపై చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం పట్ల ప్రజానీకం మండిపడుతున్నది.
ఎండాకాలం ఆరంభంలోనే జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తుండగా, సాగునీటి సంగతి దేవుడెరుగు కనీసం తాగు నీరు సైతం దొరకని దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఉన్న నీటి వనరులు పొదుపుగా వినియోగించుకునేందుకు యంత్రఅంగం అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉన్నది. కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూగర్భ జలాల పరిరక్షణకు ప్రభుత్వం వాల్టా (వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్) చట్టాన్ని కఠినంగా అమలు చేసేందుకు ఆదనపు కలెక్టర్ తో పాటు మండలాల పరిధిలో తహసీల్దార్లు, సబ్డి విజనల్ పోలీసు అధికా రులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, జిల్లా స్థాయిలో జిల్లా గ్రామీణాభివృద్ధి. భూగర్భజలవనరుల శాఖాధికారులతో కమిటీలు ఏర్పాటు చేశారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా బోర్లు వేస్తూ ఇష్టారాజ్యంగా నీటిని ఇతర అవసరాలకు తరలిస్తున్నా, ఈ కమిటీలు పట్టించుకోవడంలేదు. అత్యవసర సర్వీసులందించే గృహ, వ్యవసాయ, కేంద్ర పోలీసు, రక్షణ, నీటిపారుదల శాఖలు మినహా అన్ని విభాగాలు విధిగా అనుమ తులు తీసుకోవాలనే నిబంధనలను అమలు చేయడంలేదు.
వాల్టా ప్రకారం వాణిజ్య, వ్యవసాయ, ఇంటి అవసరాలకు నిర్దేశించిన లోతులో మాత్రమే బోర్లు వేయాల్సి ఉంటుంది. అయితే ఇందుకు విరుద్ధంగా కొద్ది రోజులుగా విచ్చలవిడిగా బోర్లు వేస్తు న్నారు. దీనిపై ఇబ్బడిముబ్బడిగా ఫిర్యా దులు రావడంతో జిల్లా అథారిటీ ద్వారా నామినేట్ చేసిన ప్రత్యేక విజిలెన్స్ బృందం నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రధానంగా కార్పొరేట్ విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లు, పరిశ్రమలు, వాణిజ్యం, బల్క్ నీటి సరఫరా, అపార్ట్మెంట్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ యూనిట్లపై నిఘా ఉంచి, ఎప్పటికప్పుడూ తనిఖీలు చేయాల్సి ఉంటుంది. నిర్దేశించిన మేరకు నీటి వినియోగాన్ని తెలుసుకునేం దుకు డిజిటల్ ప్లో మీటర్లు కూడా ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు ప్రతి నెలా ఆయా సంస్థలు వినియోగించే నీటి వివరాలు కూడా సేకరించాలి. అయితే, ఇవేమి పట్టించుకోక పోవడంతో జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు కోట్లాది లీటర్ల నీటి దుర్వినియోగం జరుగుతున్నదని స్వచ్ఛంద నీటి పొదుపు సంఘాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి నిర్వీర్యమవుతున్న వాల్టా చట్టాన్ని పటిష్టం చేయాల్సిన అవసరముందనే అభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు చర్యలు తప్పవు..
నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా భూగర్భంలో నుంచి నీటిని తోడితే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి కే.మహేశ్ హెచ్చరించారు. వాల్టా చట్ట ప్రకారం వారిపై కేసులు నమోదు చేస్తాం. అక్రమంగా నీటిని తోడుతున్నట్లు తమ దృష్టికి తెస్తే పరి శీలించి, బాధ్యులపై కఠినంగా వ్యవహ రిస్తాం. వ్యాపార, వాణిజ్యావసరాల కోసం నీటిని వాడేవారు తప్పకుండా అనుమతులు తీసుకోవాలి.