గోపాల్పేట, ఏప్రిల్ 10 : నల్లగొండ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు రూ.100 కోట్లతో వట్టెం రిజర్వాయర్ నుంచి మేడికొండ వాగు ద్వారా డిండికి తరలించి సాగు నీళ్లు ఇవ్వవచ్చని, కానీ కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి, కమీషన్ల కోసం ఏదుల రిజర్వాయర్ నుంచి రైతుల భూములకు నష్టం కలిగిస్తూ, ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ, రూ.1800 కోట్లతో ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించడం దుర్మార్గమైన చర్య మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు.
గురువారం వనపర్తి జిల్లా ఏదుల మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేత దొడ్ల రాములు అధ్యక్షతన రజతోత్సవ సభను పురస్కరించుకొని బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాకు తలమానికంగా ఏదుల రిజర్వాయర్ కేసీఆర్ ఆశీర్వాదంతో పూర్తి చేశామని గుర్తుచేశారు. కల్వకుర్తి, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుల అనుసంధానంతో కరువును పారదోలవచ్చని చెప్పారు.
రూ.600 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసి ఉంటే ప్రాజెక్టు పూర్తి అయ్యేదని తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రయోజనాలు కాపాడలేని మంత్రి జూపల్లి, శాసన సభ్యులు నేటి సాగునీటి సమస్యకు బాధ్యత వహించాలని పేర్కొన్నారు. మంచి చేసే కేసీఆర్‌ను మరిచి మాయమాటలు చెప్పే రేవంత్‌రెడ్డిని నమ్మిన ప్రజలు ఇప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ప్రస్థానం భావితరాలకు స్ఫూర్తి కలిగించాలని బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రజలు తమ ఇంటి పండుగగా భావించి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.