న్యూస్‌నెట్‌వర్క్, ఆగస్టు 9 : కృష్ణానదికి వరద పోటెత్తుండటంతో నాగార్జునసాగర్ 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. ఈ నెల 5న క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల ప్రారంభం కాగా, రోజూ 2 నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శుక్రవారం నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 2,94,009 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా అవుట్‌ఫ్లో 2,77,453 క్యూసెక్కులు ఉంది. 26 క్రస్ట్ గేట్ల ద్వారా 2,29,886 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 590 (312 టీఎంసీలు) అడుగులకు గాను 587.30 (305.6838 టీఎంసీలు) అడుగుల మేర నీరు నిల్వ ఉన్నది.
జూరాలలో 39 గేట్లు ఎత్తివేత
జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం 2.90 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 2,91,936 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీకు గాను ప్రస్తుతం 8.300 టీఎంసీలుగా ఉన్నది. శ్రీశైలం ప్రాజెక్టుకు 3,92,415 క్యూసెక్కుల వరద వస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మేడిగడ్డ బరాజ్‌కు వరద క్రమంగా తగ్గుతున్నది. శుక్రవారం 3,10,080 క్యూసెక్కుల ప్రవాహం రాగా, 85 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అన్నారం బరాజ్‌కు మానేరు, కాల్వల ద్వారా 3800 క్యూసెక్కుల నీరు వస్తున్నది.