రామడుగు/ ధర్మారం, ఆగస్ట్ 3 : ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. కాళేశ్వరం మోటర్లు నడిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రుల హెచ్చరికలు, రైతుల నుంచి వచ్చిన డిమాండ్లకు తలొగ్గింది. మరోవైపు ఆదివారం మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్ కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల పర్యటన నేపథ్యంలో ఎక్కడ అడ్డుకుంటారన్న భయంతో కాళేశ్వరం లింక్-2లో మోటర్లను ఆన్ చేసింది. ఉదయం 7.30 గంటలకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది పంప్‌హౌస్‌లో ఐదో మోటర్‌ను ప్రారంభించి, నంది రిజర్వాయర్‌లోకి అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో గాయత్రీ పంపహౌస్కు నీటిని తరలించారు.
సాయంత్రం 5.55 గంటలకు మోటర్లు ఆఫ్ చేశారు. లక్ష్మీపూర్‌లో గాయత్రీ పంపహౌస్లో ఉదయం 9.30 గంటలకు ఆరో మోటార్‌ను ప్రారంభించి, వరద కాలువలోకి తరలించారు. షానగర్ సమీపంలో వరదకాలువపై ఉన్న గేట్లను మూసివేసి, వరదకాలువపైన మల్యాల మండలం వరకు నీటిని నిల్వచేశారు. ఇక్కడ సాయంత్రం 5.30 గంటలవరకు మోటర్లను నడిపించారు. వరద కాలువకు అనుబంధంగా ఉన్న ప్రాంతంలో వానకాలం వరినాట్లు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జలాలను ఎత్తిపోసే ప్రక్రియను చేపట్టినట్టు డీఈఈ నర్సింగరావు వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్ హౌస్ నుంచి నీటి విడుదల బీఆర్ఎస్ విజయమేనని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తోపాటు తాను తరుచూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామని, రైతులకు మద్దతుగా నిరసనలు కూడా తెలిపామని గుర్తుచేశారు. ప్రభుత్వం దిగివచ్చి కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కాళేశ్వరంతోనే తెలంగాణ సస్యశ్యామలం అన్నది ప్రభుత్వం గుర్తించాలని సూచించారు.