ధర్మారం/రామడుగు 20: కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్-2లో నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్‌హౌస్‌లో బుధవారం ఒక మోటర్ ద్వారా ఎత్తిపోశారు. ఇక్కడి 4వ నంబర్ మోటర్ ద్వారా 3,150 క్యూసెకుల చొప్పున ఎత్తిపోసి నంది రిజర్వాయర్‌లోకి తరలించారు. అక్కడి నుంచి గోదావరి జలాలు జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌస్‌లోకి చేరుకుంటుండగా, అకడా ఒక మోటర్ ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి గ్రావిటీ కాలువ ద్వారా వరద కాలువకు, అక్కడి నుంచి నేరుగా శ్రీరాజరాజేశ్వర జలాశయం (మిడ్‌మానేరు)కు తరలిస్తున్నారు. కాగా, బుధవారం సాయంత్రం వరకు 4.9 టీఎంసీల జలాలను ఎత్తిపోసినట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
మర్కూక్, ఆగస్టు 20 : మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు బుధవారం నీటి పంపింగ్ ప్రారంభమైంది. భారీ వర్షాల కారణంగా కొండపోచమ్మ సాగర్ కాలువలు నిండుగా ఉండటంతో ఒక మోటర్ ద్వారా కొండపోచమ్మ సాగర్‌లోకి నీటిని పంపింగ్ చేస్తున్నట్టు ఇరిగేషన్ ఏఈ సాయిరెడ్డి తెలిపారు. వరద ఉధృతిని బట్టి మిగతా పంపులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మంగళవారం నాటికి కొండపోచమ్మ సాగర్‌లో 4.78 టీఎంసీల నీరు నిల్వ ఉన్నదని తెలిపారు. 12 టీఎంసీల వరకు నీటిని నింపనున్నట్టు ఆయన పేర్కొన్నారు.