Nagarjunasagar | నల్లగొండ ప్రతినిధి, మార్చి 21 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్‌లో అడుగంటిన నీటి నిల్వలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఈ ఏడాది సమృద్ధిగా వానలు పడినప్పటికీ, నవంబర్ చివరి దాకా సాగర్ డ్యామ్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నప్పటికీ, గత ఐదేండ్లలో ఎన్నడూ లేనివిధంగా వేసవి ఆరంభంలోనే డెడ్‌స్టోరేజీ లెవల్‌కు చేరువైంది. దీంతో నల్లగొండ జిల్లాలో సాగర్ ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
నిజానికి, గత జూలై చివరి వారం నుంచే నాగార్జునసాగర్‌కు వరద మొదలై కొద్దిరోజుల్లోనే పూర్తిగా నిండింది. అప్పటినుంచి అక్టోబర్ వరకు సాగర్ డ్యామ్ గేట్ల పై నుంచి కృష్ణమ్మ దిగువకు ప్రవహిస్తూనే ఉన్నది. నవంబర్ చివరి వరకు డ్యామ్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం కొనసాగింది. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు ఈ ఏడాది 1,203 టీఎంసీల వరద నీరు వచ్చి చేరగా, కుడి కాల్వకు 185 టీఎంసీలు, ఎడమ కాల్వకు 114 టీఎంసీలు, ప్రధాన జల విద్యుత్తు కేంద్రం ద్వారా 245 టీఎంసీల నీటిని విడుదల చేశారు. క్రస్ట్ గేట్ల ద్వారా మూడు నెలలపాటు 623 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. డిసెంబర్ నుంచి ఎడమ, కుడి కాల్వల ఆయకట్టుకు యాసంగి పంటలకు నీటి విడుదల మొదలైంది. కుడికాల్వ ద్వారా ఆంధ్రప్రదేశ్ విచ్చలవిడిగా నీటిని తరలించుకుపోవడంతో సాగర్ డ్యామ్‌లో నీటిమట్టం చూస్తుండగానే అడుగంటిపోయింది. దీంతో 3 నెలల్లోనే నిండుకుండలా ఉన్న సాగర్ డెడ్‌స్టోరేజీకి చేరువైంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సాగర్‌లో నీటి నిల్వ 519.60 అడుగుల వద్ద 148.5482 టీఎంసీల నీరు ఉన్నది. అంటే డెడ్‌స్టోరేజీకి పైన ఇంకా 9.60 అడుగులు (16.8792 టీఎంసీలు) నీరు మాత్రమే నిల్వ ఉన్నది.
వరదకాల్వ రైతులకు శాపం
కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం అడ్డగోలుగా తరలించుకుపోతున్నా, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర నటించడం నల్లగొండ జిల్లాలోని వరదకాల్వ ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. నాగార్జునసాగర్ నుంచి విచ్చలవిడిగా ఏపీ సర్కార్ నీటిని తరలించుకొనిపోవడంతో డెడ్‌స్టోరేజీకి రిజర్వాయర్ చేరువైంది. దీంతో వరదకాల్వ పంపుహౌస్‌కు నీరు అందడం లేదు. దీంతో వరదకాల్వకు నీటిని ఎత్తిపోయాల్సిన మూడు మోటర్లు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఫలితంగా వరదకాల్వ పరిధిలోని 30 వేల ఎకరాల్లోని పంటలకు గడ్డు పరిస్థితులు దాపురించాయి. కనీసం మరో పదిహేను రోజులు నీటిని విడుదల చేస్తేనే పంటలు చేతికి వస్తాయని రైతులు చెప్తున్నారు. శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసి, సాగర్ ఎడమ, కుడి కాల్వలకు నీటి విడుదలను నియంత్రిస్తే తప్ప, మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. సాగర్ కనీస నీటిమట్టం 521 అడుగులకుపైగా ఉంటేనే రెండు మోటర్లనైనా రన్ చేసే అవకాశం ఉంటుందని ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద కాల్వ పరిస్థితి చర్చనీయాంశంగా మారింది.
శ్రీశైలం వైపు ఆశగా చూపులు
శ్రీశైలం నుంచి నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తే తప్ప.. వరదకాల్వ మోటర్లు ఆన్ అయ్యే అవకాశం లేదు. శ్రీశైలం నుంచి తెలంగాణ పవర్‌హౌస్ ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తే, రెండు మూడు రోజుల్లో సాగర్‌లో నీటిమట్టం కనీసం రెండు అడుగులు పెరిగితేనే వరదకాల్వ ఆయకట్టకు నీరు అందుతుంది. అంటే సాగర్‌లో కనీసం 521 అడుగుల నీటిమట్టం మెయిన్‌టెన్ చేస్తే తప్ప, వరదకాల్వ మోటర్లు పూర్తిస్థాయిలో నడిచే పరిస్థితి లేదు. ఇదే విషయాన్ని వారం క్రితమే ప్రాజెక్టు అధికారులు స్థానిక కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 18 నాటికి సాగర్‌లో నీటిమట్టం 518.80 అడుగులకు పడిపోయింది. దీంతో శ్రీశైలం నుంచి పవర్ జనరేషన్ ద్వారా నీటిని వదులుతుండటంతో 3 రోజుల్లో 0.80 అడుగుల నీటిమట్టం పెరిగి, 519.60 అడుగులకు చేరింది. కానీ, 521 అడుగులు దాటితేనే కనీసం 2 మోటర్లు నడుపవచ్చని అధికారులు చెప్తున్నారు. ఎడమ, కుడి కాల్వలకూ నీటి విడుదలను తగ్గించాలని నిర్ణయించినట్టు తెలిసింది. మొత్తంగా శ్రీశైలం నుంచి వచ్చే నీటిపైనే వరదకాల్వ ఆయకట్టు భవిష్యత్ ఆధారపడి ఉన్నది. గత ఐదేండ్లల్లో కిందటి ఏడాదిని వదిలేస్తే కేసీఆర్ హయాంలోని చివరి నాలుగేండ్లు ఏనాడూ వరదకాల్వకు నీటి విడుదల నిలిచిపోలేదని అధికారులు చెప్తున్నారు.
80 వేల ఎకరాల ఆయకట్టు కోసం
సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పైభాగంలోని ఏఎంఆర్పీ ఆయకట్టు దిగువ ప్రాంతంలోని పెద్దవూర, అనుముల, నిడమనూరు, త్రిపురారం, తిప్పర్తి, వేములపల్లి మండలాల్లోని సుమారు 80 చెరువులను నింపి 80 వేల ఎకరాలకు సాగు నీరందించే ఉద్దేశంతో వరదకాల్వ నిర్మాణం చేపట్టారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ఆధారంగా రిజర్వాయర్‌లో నీటిమట్టం 570 అడుగులు చేరగానే గ్రావిటీ ద్వారా వరదకాల్వలోకి నీరు పారే విధంగానూ, అంతకు తక్కువ నీటిమ ట్టం ఉన్న సమయంలో మోటర్ల ద్వారా ఎత్తిపోసే విధంగానూ డిజైన్ చేశారు. 2006లో సాగర్ రిజర్వాయర్‌కు ఆనుకుని ఉన్న పెద్దవూర మండలం పూల్యాతండా నుంచి వేములపల్లి మండలం మొల్కపట్నం వరకు 86 కిలోమీటర్ల పొడవుతో ప్రధాన కాల్వను, దాని నుంచి డిస్ట్రిబ్యూటరీలను నిర్మించి 80 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలనేది దీని లక్ష్యం. ప్రత్యక్షంగా 50 వేల ఎకరాలకు, పరోక్షంగా మరో 30 వేల ఎకరాలకు దీని ద్వారా సాగునీరు అందుతుంది. దీన్ని కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలోనే వదిలేయడంతో బీఆర్ఎస్ సర్కార్ వచ్చాక 2016లో పంపుహౌస్‌ను పూర్తి చేసి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మోటర్లను ఆన్ చేసి కాల్వలోకి నీటిని విడుదల చేశారు. అప్ప టి నుంచి దీని పరిధిలో ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 2023 యాసంగి వరకు సమృద్ధిగా నీరు అందించడంతో రైతులు పుష్కలంగా పంటలు పండించుకున్నారు. కానీ, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ సీజన్ చివరలో ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్ధకంగా మారింది.
నిలిచిపోయిన మోటర్లు
నాగార్జునసాగర్‌లో నీటిమట్టం తగ్గిపోవడంతో వరదకాల్వకు నీటిని ఎత్తిపోయాల్సిన మోటర్లు నిలిచిపోయాయి. సాగర్‌లో 521 అడగులకుపైగా నీటిమట్టం ఉంటేనే మొత్తం మూడు మోటర్లలో కనీసం రెండు మోటర్లను రన్ చేయడానికి వీలవుతుంది. 520 అడుగులపైన ఉంటే ఒక్క మోటర్ మాత్రమే రన్ అవుతుంది. అయితే, ఈ నెల 13వ తేదీ నాటికే నీటిమట్టం 521 అడుగులకు పడిపోవడంతో ఒక్క మోటర్నే రన్ చేశారు. ఈ నెల 15 నుంచి 519.70 అడుగులకు తగ్గిపోవడంతో ఆ ఒక్క మోటర్ కూడా నిలిచిపోయినట్టు అధికారులు తెలిపారు. దీంతో వారం రోజులుగా వరద కాల్వలోకి నీటి విడుదల నిలిచిపోయింది. అధికారులు చెప్తున్న దాని ప్రకారం.. ప్రస్తుతం నా లుగు గంటలు వేచి చూస్తే, సర్జ్‌పూల్‌లోకి ఊ ట ద్వారా వచ్చి చేరుతున్న నీటితో ఒక గంటపాటు ఒక మోటర్‌ను రన్ చేయగలుగుతున్నారు. దీనిద్వారా ప్రధాన కాల్వలోకి కేవ లం 12 కిలోమీటర్ల వరకు నీరు పారుతున్న ది. తూములకు నీళ్లు ఎక్కడం లేదు. మోట ర్లు నిలిచిపోవడం వల్ల నిడమనూరు మండలంలోని కొన్ని గ్రామాలతోపాటు మాడ్గులపల్లి, వేములపల్లి మండలాల్లోని 30 వేల ఎకరాల పంటలపై తీవ్ర ఆందోళన నెలకొన్నది.
ప్రభుత్వ అసమర్థత వల్లే రైతులకు కష్టాలు
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే రైతులు అనేక కష్టాలు పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఏనా డూ ఇబ్బందులు పడలేదు. ఏఎమ్మార్పీ వరదకాల్వ మొదటినుంచి చివరి వరకు 30 వేల ఎకరాల వరకు సాగవుతాయి. నాగార్జునసాగర్ జలాశయం నిండుగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రభు త్వం సరిగా నీటిని వాడుకోకుండా, ఆంధ్రా రాజకీయాలకు భయపడి నీళ్లు అందించకపోవడంతో రైతులు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు. అప్పులు చే సి మరీ సాగు చేసిన వరి పొలాలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం సరైన ప్రణాళికతో నీటిని వాడుకోలేదు. నీటి సరఫరాపై ప్ర భుత్వానికి ఏమాత్రం అవగాహన లేదు. ప్రణాళికాబద్ధంగా వాడుకుంటే ఈ పరిస్థితి వచ్చేదికాదు. ప్రభు త్వం కండ్లు తెరిచి సాగునీరు అందించా లి.
– వెన్న శ్రవణ్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాడ్గులపల్లి
పంటలు ఎండిపోతున్నాయి
నాకున్న నాలుగెకరాల్లో వరి పంట సాగు చేశా. పది రోజుల నుంచి వరదకాల్వ నీళ్లు రాకపోవడంతో పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. మరో 20 రోజులైతే నా పంట చేతికొస్తుంది. కానీ, ఈ సమయంలో నీరు అందించకపోవడంతో పంటలు ఎండిపోయి పశువులకు మేపడానికి తప్ప ఏం ఉపయోగం లేదు. వెంటనే అధికారులు వరద కాల్వ ద్వారా నీటిని అందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలి.
-తవిటి సైదులు, రైతు,నారాయణపురం, మాడ్గులపల్లి మండలం