Nagarjuna Sagar | ఎగువన కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు పెద్దఎత్తున వరద వచ్చిచేరుతున్నది. శ్రీశైలం నుంచి 67 వేల క్యూసెక్కుల వరద సాగర్‌కు వస్తున్నది. దీంతో నీటిమట్టం 546 అడుగులకు చేరింది. అయితే క్రమంగా పెరుగుతున్న నీటిమట్టంతో సాగర్ డ్యామ్‌కు ముప్పు పొంచిఉన్నది. ప్రాజెక్టులోని నాలుగు క్రస్టు గేట్ల నుంచి నీరు లీకవుతున్నది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మొత్తం 26 క్రస్టుగేట్లు ఉన్నాయి. వాటిలో 8, 23, 24, 25వ నంబర్ క్రస్టుగేట్ల నుంచి వరద బయటకు వస్తున్నది. నాలుగు గేట్లకు రబ్బర్ సీల్ నీరు కిందికి వెళ్తున్నది. ఇలా ప్రతిరోజూ 70 క్యూసెక్కుల నీరు లీకవుతున్నట్లు తెలుస్తున్నది. అయితే మే నెలలోనే ఆ గేట్లకు అధికారులు మరమ్మతులు చేశారు. అయినప్పటికీ నీరు లీకవుతుండటం పట్ల నిపుణులు ఆదోంళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, నాగార్జునసాగర్‌కు 67,133 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతున్నది. 1800 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 563.90 అడుగుల వద్ద నీరు ఉన్నది. అదేవిధంగా డ్యామ్‌లో మొత్తం 312 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ఇప్పుడు 241.53 టీఎంసీల నీరు ఉన్నది.